విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ లో టూరిజం స్టాల్ ను సందర్శించి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
విశాఖపట్నం :విశాఖ సీఐఐ సమ్మిట్ కు అద్భుత స్పందన వచ్చిందని, కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో దాదాపు 70కి పైగా దేశాల నుండి ప్రతినిధులు వచ్చారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు.
సీఐఐ సదస్సు ద్వారా విశాఖ, అమరావతి, తిరుపతిలో పర్యాటక రంగంలో పెట్టుబడులు రానున్నాయని, పర్యాటక రంగంలో దాదాపు 100 అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నామని వెల్లడించారు.
సీఐఐ సమ్మిట్ లో భాగంగా టూరిజం స్టాల్ ను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా టూరిజం స్టాళ్ల వివరాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి, టూరిజం అధికారులు మంత్రి దుర్గేష్ కి వివరించారు. రాష్టంలో ఎక్కడెక్కడ ఏయే పర్యాటక ప్రాంతాలున్నాయో తెలుసుకునేలా టచ్ క్యూయోస్ మెషిన్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. టెక్నాలజీ ద్వారా పర్యాటకులకు అరకు, గండికోట తదితర పర్యాటక గమ్యస్థానాల అనుభవాలను, సాహస పర్యాటక అనుభవాలను అందించే మెషిన్ ను ప్రారంభించారు. లేపాక్షి హస్త కళలు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఏపీ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఖాదీ వస్త్రాలను పరిశీలించి తయారీ విధానం తెలుసుకున్నారు.అరకు కాఫీని టేస్ట్ చేసి అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నామని వెల్లడించారు. బీన్ బోర్డు నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇండియన్ ఫస్ట్ రోబోటిక్ కేఫ్ ను పరిశీలించి, రోబో పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ట్రీ టూ బార్ చాక్లెట్, ఇంటర్నేషనల్ చాక్లెట్ సెలూన్, కోకోనట్ కేఫ్ సందర్శించి కొబ్బరితో తయారైన సంబంధిత తిను బండారాలను టేస్ట్ చేసారు. మంగళగిరి, పెడన, వెంకటగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల తదితర 34 చేనేత వస్త్రాలను పొందుపరిచిన స్టాల్ సందర్శించారు.
విభిన్న పర్యాటక ప్రక్రియలను పరిచయం చేస్తూ అన్ని పర్యాటక విభాగాలను సద్వినియోగం చేసుకుంటున్నామని, అన్ని వర్గాల వారికి అందుబాటులో పర్యాటకం ఉంటుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక రంగం బాగుంటే ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడి జరుగుతుందన్నారు.
కైలాసగిరి పై త్రిశూల్ ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులో తీసుకొస్తామని, దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.
గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని కుదేలు చేస్తే తాము తిరిగి పునరుద్ధరిస్తున్నామన్నారు.
విశాఖ సిఐఐ సమ్మిట్ పర్యాటక రంగానికి వేలాది కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుందని ఆశిస్తున్నమని మంత్రి దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వ తీరుతో నమ్మకం కోల్పోయిన పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో పునరుత్తేజం వచ్చిందని,. నూతన పర్యాటక పాలసీపై ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. త్వరలోనే పర్యాటక రంగం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ప్రత్యేక శ్రద్ధతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. గడిచిన 15 నెలల కాలంలో పర్యాటక రంగంలో దాదాపు 12 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించారు.
సమ్మిట్ లో భాగంగా మంత్రి దుర్గేష్ కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మలతో పాటు సహచర మంత్రులైన నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనిత, సవిత, సంధ్యారాణి, భరత్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులను కలిశారు.


