నియోజకవర్గంలో అంధత్వ నివారణకు చర్యలు
ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు : (వెస్ట్ గొదావరి బ్యూరో) (అక్షరభూమి)
తణుకు నియోజకవర్గంలో అంధత్వ నివారణ కోసం ఏడాదికి రెండు, మూడు పర్యాయాలు కంటి వైద్య శిబిరాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. ఇటీవల తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వారందరికీ సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 228 మంది కాట్రాక్ట్ శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితి ఉందని వారందరికీ త్వరలోనే శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 96 మందికి కంటి చూపు మందగించడంతో వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 125 మందికి కళ్ళజోళ్ళను అందజేశామన్నారు. వైద్య శిబిరం జరిగిన రోజే మరో 380 మందికి కళ్ళజోళ్ళు అందజేశామని వెల్లడించారు.మొత్తం మీద 1127 మందికి కాట్రాక్ట్ శాస్త్ర చికిత్సలతో పాటు కళ్ళజోళ్లను అందించామని వివరించారు. తణుకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పేద ప్రజలందరూ ఈ శిబిరాన్ని వినియోగించుకొని ఫలితాలను పొందడం సంతృప్తినిచ్చిందని అన్నారు. చాలామంది కంటికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. దీనిని నివారించడానికి రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


