మొదటి రోజే 95 శాతం పెన్షన్లు పంపిణీ లక్ష్యంగా కృషి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యధికంగా పెన్షన్లు అందిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో సైతం రూ. 2 వేలు దాటి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదని అన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రమే రూ. 4 వేలు పెన్షన్ ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల బాధ్యత ఉన్నదని చెప్పడానికి ఇది నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. మొదటి రోజే దాదాపు 95 శాతం పెన్షన్లు ఇంటింటికి వెళ్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో ప్రతి నెలా దాదాపు 34 వేల పెన్షన్లు రూ. 16 కోట్లు అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పెద్దన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాధ్యత తీసుకొని ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..


