:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఉండ్రాజవరం మండల కేంద్రంలోని సుధీంద్ర బాబు కళ్యాణ మండపంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
44 మంది బాధితులకు రూ.25.52 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ
ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 388 మందికి రూ.3.10 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి
వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలు నియోజకవర్గం లో ప్రధాన రహదారులన్నీ బాగు చేస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: పేదల ఆరోగ్యానికి సిఎంఆర్ భరోసా ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం ఉండ్రాజవరం మండల కేంద్రంలోని సుధీంద్ర బాబు కళ్యాణ మండపంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 44 మంది బాధితులకు రూ.25.52 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ పంపిణీ చేశారు. అందులో 43 మందికి రూ.21,02,274 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒకరికి రూ. 4.50 లక్షల విలువైన ఎల్ వోసీ పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం అని , ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 388 మందికి రూ.3.10 కోట్ల మేర లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఉండ్రాజవరం మండల బాధితులు నిడదవోలుకు రావడం ఇబ్బందని గ్రహించి నేడు ఉండ్రాజవరం మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని మంత్రి దుర్గేష్ అన్నారు.ఇకపై సీఎంఆర్ఎఫ్ చెక్కులు క్యాంపు కార్యాలయం ద్వారా కాకుండా ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి సహా ఒక్కో మండలంలో ఒక్కోసారి నిర్వహిస్తామన్నారు. చివరిసారి పెరవలి మండలంలో చెక్కులు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నెల రెండు పర్యాయాలు చెక్కుల పంపిణీ కార్యక్రమం ద్వారా బాధితులకు లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న అనంతరం బాధిత లబ్ధిదారులు సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో మంత్రి కందుల దుర్గేష్ ఎప్పుడు ముందుంటారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆపన్నులకు హస్తం అందించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా నిరంతరం ఆర్థికసాయం అందిస్తుందని అన్నారు.గతంలో ఈ స్థాయిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థికసాయం అందిన దాఖలాలు లేవన్నారు. అరకొరగా మాత్రమే సాయం అందేది అన్నారు. గత ప్రభుత్వం ఇష్టా రీతిన నిధులు పక్కదారిన పట్టించిన విషయాన్ని మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల నేడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో వారి సంక్షేమం కోసం అక్టోబర్ 4వ తేదీన వాహన మిత్ర ద్వారా వారి ఖాతాలో 15 వేల రూపాయలు నగదు జమ చేయనున్నామని తెలిపారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిడదవోలులో ధాన్యం సేకరణకు పెద్దపీట వేశామని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే డబ్బులు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి చూపించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేశారని, ఇటీవలే మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు విస్తృత ప్రయోజనం కలుగనుందని తెలిపారు. లోక్ కళ్యాణ్ కార్యక్రమాల ద్వారా చిరు వ్యాపారులకు సహకారం అందిస్తూ లక్షాధికారులను, కోటీశ్వరులను చేస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథకంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రులు, శాసనసభ్యులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు.
నిడదవోలు నియోజకవర్గం కానూరు, చివటం, ఉండ్రాజవరం వెళ్లే ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే ఆయా రోడ్లకు అనుమతులు మంజూరు అయ్యాయని, కొన్నింటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే నియోజకవర్గంలోని రోడ్లన్నీ బాగు చేస్తామని ప్రకటించారు.
ఓ వైపు ప్రజల ఆరోగ్యం, మరోవైపు నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి, ఇంకోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కార్యక్రమంలో ఉండ్రాజవరం మండలం కూటమి నాయకులు పాల్గొన్నారు.


