తణుకులో ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మాణానికి చర్యలు
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
గత కోన్నేళ్లుగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా గోస్తనీ ఆనుకుని బండ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా బండ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకు తోడు విద్య, వైద్యం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. తణుకులోని గోల్డెన్ జూబ్లీ రోడ్డు నుంచి సొసైటీ రోడ్డు వరకు ఒక రోడ్డు, అక్కడి నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ శివాలయం రోడ్డు వరకు ఒక రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. దీని ద్వారా రాష్ట్రపతి రోడ్డు అవసరం లేకుండా ప్రయాణం చేయదలచిన వారు ఈ రోడ్డు మార్గం ద్వారా జాతీయ రహదారిని సైతం అనుసంధానం చేస్తూ ప్రయాణించవచ్చన చెప్పారు. రాబోయే రోజుల్లో అర్బనైజేషన్‌లో భాగంగా మాస్టర్ ప్లాన్‌లో ఉన్న కొత్త రోడ్లు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


