విశాఖపట్నం: సెప్టెంబర్ 17 (కోస్టల్ న్యూస్)
నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయ ఆసియా దేశాల సోక్రటీస్, సంఘసంస్కరణ ఉద్యమానికి తండ్రి, అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి అర్ధ రహిత సాంప్రదాయాలకి, నీచమైన ఆచారాలకు బద్ద శత్రువుగా యునెస్కోచేత కొనియాడబడిన పెరియార్ ఈవి రామసామి దేశంలో 90 శాతం పైగా ఉన్న అణగారిన, వెనుకబడిన కులాల అభ్యున్నతికై జీవితాంతం కృషి చేశాడని రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ దినపత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. పెరియార్ ఇవి రామసామి 147వ జయంతి కార్యక్రమం బీచ్ రోడ్ లో ఆయన విగ్రహం వద్ద భారత నాస్తిక సమాజం మరియు పెరియార్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మనిషికి మనిషికి మధ్య చిచ్చు పెడుతున్న అసమానతలను పెంచే కులాలను నిర్మూలించాలని, కుల అసమానతలకు వ్యతిరేకంగా పెరియార్ పోరాటం చేశారని, మానవుల మధ్య అసమానతలకు కులం ఏవిధంగా కారణమైందో వివరిస్తూనే ఆ అసమానతల నుండి బయటపడడానికి నిర్విరామ కృషి చేశారన్నారు. భారత నాస్తిక సమాజం జాతీయ కన్వీనర్ జె రవి మాట్లాడుతూ మహిళల స్వేచ్ఛ పట్ల పెరియార్ అభిప్రాయాలు విప్లవాత్మకమైనవని, మనం స్వేచ్ఛగా ఉండాలంటే స్త్రీలకు సమాన స్వేచ్ఛ ఇవ్వాలని అభిలాషించారని అన్నారు. అంటరానితనం నిర్మూలనకు, దళితులకు విద్యను అందించడం, చెరువులు, నూతుల నుండి దళితులు నీరు ఉపయోగించుకునే హక్కు కోసం పెరియార్ ఎంతో కృషి చేశారన్నారు. పీడిత కుల ప్రజలకు, సాంఘిక ఆర్థిక రాజకీయ అణిచివేతల నుంచి విముక్తికై పెరియార్ సాగించిన ఉద్యమం, చేపట్టిన సిద్ధాంతం విలక్షణమైనదని భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు టి శ్రీరామమూర్తి అన్నారు. సీపీఐ నాయకులు ఎం. పైడిరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెరియార్ విశేష కృషి చేశారని, స్త్రీ హక్కులకై ఉద్యమించిన నేత అని అన్నారు.ఈ కార్యక్రమంలో పెరియార్ ఆశయ సాధన సంఘం సెక్రటరీ పి పెంటారావు, దళిత సేన నాయకులు గణపతి, న్యాయవాది సురేష్, భారత నాస్తిక సమాజం నాయకులు వై నూకరాజు, రవి, సునీత, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.


