తణుకు ఇంపల్స్ కళాశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ రామ్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా రాష్ట్ర వివర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు వావిలాల సరళ దేవి, సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్ కుమార్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాత్ర ఎనలేనిదని అన్నారు. ముఖ్యఅతిథి వావిలాల సరళ దేవి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉత్తమ విజయాలను సాధించాలని అన్నారు. మనిషి జీవితంలో తల్లి పాత్ర వెలకట్టలేనిదని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి విజయాలను సాధించి కళాశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఎంతో ఉత్తమంగా చదవడం ద్వారా పట్టణంలోనే మంచిర్యాంకులతో ఇంపల్స్ కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించారని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు తమ అమూల్యమైన సందేశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.


