సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న బాధితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడే అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణానికి చెందిన తుపాకుల శ్రీనివాస్ అనే బాధితుడికి సీఎం సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల చెక్కును మంగళవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేసి మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల తణుకు పర్యటన సందర్భంగా బాధితుడు శ్రీనివాస్ కలిసి తన గోడును వెళ్లబోసుకోవడంతో స్పందించిన సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. దీంతో అరుదైన వ్యాధి కావడంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు సంబంధించిన అర్జీలను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణకు బాధితుడు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.


