నువ్వు నేర్పిన రాజకీయం ఏంటో చూపిస్తాను
నీ గత చరిత్ర, రాజకీయ ప్రవేశం ప్రజలకు తెలుసు
అత్తిలిలో కూటమి జెండా ఎగిరి తీరుతుందని ఛాలెంజ్
మంత్రి శ్రీనివాసవర్మను విమర్శించే అర్హత లేదు
మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ధ్వజం
కారుమురి… గత అయిదేళ్లలో నువ్వు చేసిన రాజకీయాన్నే నేను కూడా అనుసరిస్తాను. రాజకీయానికి రాజకీయం చేసి నేను ఏంటో చూపిస్తాను… అధికారంలో ఉన్న సమయంలో అధికార మదంతో, ఒళ్లు కొవ్వెక్కి సంస్కారం లేకుండా మాట్లాడిన మాటలు ఇంకా మర్చిపోలేదు… ఖబడ్దార్ కారుమూరి… నాలుగేళ్లు అధికారంలో ఉంటా… పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ కూర్చోను… నువ్వు ఎగిరినంతసేపు నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు… అధికారం ఎలా చేయాలో… రాజకీయాలు ఎలా చేయాలో నేర్పించావు… ఇకపై నేను కూడా రాజకీయమే చేస్తా… నీ బతుకేంటో… నీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగిందో నియోజకవర్గ ప్రజలకు తెలుసు… అంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తణుకు పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి కాబట్టే మంత్రి అయ్యారని అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న కారుమూరి టీడీఆర్ అక్రమ సొమ్ములతో మంత్రి అయ్యారని విమర్శించారు. శ్రీనివాసవర్మను విమర్శించే అర్హత కారుమూరికి లేదన్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ గతంలో చేసిన చేసిన వ్యాఖ్యలపై కనీసం ఆలోచన లేకుండా ఏమేం మాట్లాడామో కనీసం జ్ఞానం లేకుండా ఆలోచన శక్తి కోల్పోయి అధికారం కోల్పోయినప్పటికీ తిరిగి అదేవిధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎడిటింగ్ మాస్టర్ అంటూ విమర్శలు చేస్తున్న కారుమూరి అప్పట్లో రైతులను ఎర్రిపప్ప అంటూ దూషించలేదా… అర్జునుడుపాలెంలో రైతులపై విరుచుకుపడలేదా… నరికేస్తాం… ఇంట్లోంచి లక్కొచ్చి కొడతాం… అంటూ చేసిన వ్యాఖ్యలను ఎవరు ఎడిటింగ్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కారుమూరి ముందు తన నోటిని ఎడిటింగ్ చేసుకోవాలని హితవు పలికారు. ఒళ్లు తెలియకుండా అధికార మదంతో అడుగు మేర కొవ్వు పట్టి ఆరోజు మాట్లాడిన మాటలను నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదు కాబట్టే ఓడించి మూలన కూర్చోబెట్టారని అన్నారు. తనను సైతం వ్యక్తిగతంగా దూషించిన మాటలను ఎవరు ఎడిటింగ్ చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. ముందు మాట్లాడుతున్న భాషను సరిచేసుకుంటే ఎవరూ ఎడిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదని ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని నోటి దురద తగ్గించుకోవాలని ఎద్దేవా చేశారు. నీ గత చరిత్ర ఏంటో… నువ్వు ఎలా రాజకీయాల్లోకి వచ్చావో… నువ్వు ఒక చదువుకోని సన్నాసివని అందరికీ తెలుసని అన్నారు. అధికార పార్టీ నాయకులపై బురద జల్లేద్దాం అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు.
నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించిన కారుమూరి
గతంలో మంత్రిగా పని చేసిన సమయంలో కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఎక్కడెక్కడ చేయించిన వ్యభిచారాలు, అలవాట్లు తమపై రుద్దడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెబుతూ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అధికార పార్టీలో ఏమైనా తప్పులు జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా సూచలను చేయాలని తప్ప విజిటింగ్ పొలిటీషియన్‌గా నియోజకవర్గానికి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి బురద జల్లి వెళ్లిపోతే కడుక్కోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన కాలంలో దోచుకున్న సొమ్ములతో దుబాయి, సౌత్ ఆఫ్రికాలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్లు కాకుండా ఖనిజం గనుల్లో రూ. కోట్లు కొల్లగొట్టానని చెప్పుకుంటున్నారని స్వయంగా కారుమూరి చెప్పుకుంటున్నారని విమర్శించారు. కారుమూరి తణుకు నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో తణుకు నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ ఎవవరూ చేయలేదని గౌరవ ప్రదమైన వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పని చేశారన్నారు. 2009లో కారుమూరి అడుగుపెట్టిన నాటి నుంచి బెదిరింపు రాజకీయాలు, కొత్త రాజకీయాలు, సంస్కృతులు తీసుకువచ్చింది కారుమూరి కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకు చెందిన పెద్దలు గౌరవ ప్రదమైన వ్యక్తులు కాబట్టే నీలాంటి వెధవల నోట్లో నోరు పెట్టేవారు కాదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన సమయంలో నాకు ఏమీ చేతకాదని… తొక్కుకుంటూ వెళ్లిపోతానంటూ… ఒంటి చేతితో ఓడించేవాడినని కబుర్లు చెప్పారని గుర్తు చేశారు. అత్తిలి ఎంపీపీ ఎన్నికల విషయంలో ఇంటిపైకి దాడికి ప్రయత్నించారని ముసలి కన్నీరు కార్చుతున్నారని నిజంగా దాడులు చేయాలంటే ఒక్క సైగ చేస్తే బయటకు లాగి మరీ కొట్టేవాళ్లన్నారు. అలాంటి సంస్కృతిని ప్రేరేపించలేదు కాబట్టే అప్పుడు తమ కార్యకర్తలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నిజంగా ఎంపీటీసీల బలం ఉంటే విజయవాడలో ఎందుకు క్యాంపు రాజకీయాలు చేశారు… శ్రీశైలం ఎందుకు పంపారు… ఖండవల్లి ఫ్యాక్టరీలో ఎందుకు దాచారని ప్రశ్నించారు. తమ పార్టీకు చెందిన ఎంపీటీసీలను బలవంతంగా తీసికెళ్లారు కాబట్టి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారని అన్నారు. అత్తిలి మండలంలో ఎంపీపీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి జెండానే అక్కడ ఎగురుతుందని చాలెంజ్ విసిరారు.
నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు….
తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చేసే తప్పుడు పనులను ఎప్పటికప్పుడు ఎదుర్కొనేలా తానుకూడా రాజకీయమే చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ ధ్వజమెత్తారు. నోరుతోపాటు శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలని సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత, హక్కు కారుమూరికి లేదన్నారు. అధికారంలో ఉండి మంత్రిగా పని చేస్తూ అప్పట్లో అమరావతి మహిళలు వస్తే ఏం చేశారని ప్రశ్నించారు. అయితంపూడి వద్ద నల్ల జెండాలు పెట్టి అడ్డుకోలేదా… ఆనాడు మహిళలపై దాడులు చేయించలేదా… ఇవన్నీ చేసినా అడ్డుకుని నిలబడ్డామని గుర్తు చేశారు. ఇవన్నీ మర్చిపోయిన కారుమూరి సంస్కారవంతుడిగా మాట్లాడుతుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అమరావతి రైతులను అడ్డుకోకపోగా తణుకు నియోజకవర్గంలో అడ్డుకుని కొత్త సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండు పర్యాయాలు తణుకు నియోజకవర్గానికి వస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేసిన వేషాలు ఇంకా నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదన్నారు. కనీసం రాష్ట్రపతిరోడ్డులోకి ప్రవేశం లేకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని చేసి దురాగతాలు మర్చిపోలేదన్నారు. వీటన్నింటి ఫలితమే రాజకీయానికి రాజకీయం చేసి చూపిస్తానని హెచ్చరించారు. మేం కూడా ఉప్పు, కారం తింటున్నాం… నువ్వు ఏం చేస్తే దానికి తల వంచి వెళ్లిపోయే రోజులు పోయాయని రాధాకృష్ణ హెచ్చరించారు.
ప్రత్యర్థులపై దాడులు ప్రారంభించింది మీరు కాదా
పల్నాడులో చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నడిరోడ్డుపై వైసీపీ గుండాలు నరికి చంపినా జై తెలుగుదేశం… జైచంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలారని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు ఇన్ఛార్జిగా ఉన్న కారుమూరికి ఇవన్నీ తెలియవా అని ప్రశ్నించారు. ఇలా ప్రత్యర్థులపై దాడులు ప్రారంభించింది ఎవరనేది ముందు తెలుసుకోవాలన్నారు. బుద్దా వెంకన్న, బొండా ఉమలపై దాడులు చేయించలేదా అని ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పాలని కారుమూరిని ప్రశ్నించారు. దాడులు, హత్యల సంస్కృతికి ఆజ్యం పోసింది వైసీపీ నాయకులు కాదా అన్నారు. కాళ్లు, చేతులు చాపుకొని కూర్చుంటానని వచ్చి నరికేయాలని చెబుతున్న కారుమూరిని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో నరికి మూలన కూరోచబెట్టారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో నూకలు లేకుండా బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధితోపాటు అన్ని రకాల రాజకీయం చేస్తానని చెప్పారు. రోజుకు నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడతానని మరో నాలుగు గంటలు కారుమూరి రాజకీయం కోసం కేటాయిస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


