నరికేస్తాం, ఇంట్లోంచి లాగి కొడతామంటూ వ్యాఖ్యలు
తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి
తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ – తణుకులో విలేకరులతో మాట్లాడిన కూటమి నాయకులు
మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వల్ల తమకు ప్రాణహాని పొంచి ఉందని తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తణుకులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఏలూరులో జరిగిన వైసిపి ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే టిడిపి నాయకులను నరికేస్తామని, ఇంట్లోంచి బయటకు లాగి మరీ కొడతామంటూ చేసిన వ్యాఖ్యలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ మాట్లాడుతూ నిజాయితీ కలిగిన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. నోరు అదుపులో లేకుండా కారుమూరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండించారు. మాజీ మంత్రిగా కారుమూరి చేసిన దోపిడీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. వారానికి ఒకసారి నియోజవర్గానికి వచ్చి ఏదో ఒక బురద జల్లి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో ఎంతమందిని హత్య చేయించారో ఎంతమంది పై దాడి చేయించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. కారుమూరి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే పోలీసులు స్పందించి హత్యాచారయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇరగవరం జడ్పిటిసి మాజీ సభ్యులు చుక్కా సాయిబాబా మాట్లాడుతూ జత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రజలకు స్వేచ్చలేని రోజులు ఉన్నాయని ఈ పరిస్థితుల్లో తాజాగా మాజీ మంత్రి కారిమూరి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అభద్రతాభావంతో, ఓడిపోయామనే బాధతో కారుమూరి కారు కూతలు కూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా కారుమూరి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. తక్షణమే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ గత వైసిపి పాలన హయాంలో దళితులను లక్ష్యంగా చేసుకునే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే నరికేస్తామంటూ, ఇంట్లోంచి బయటికి లాగి దాడి చేస్తామంటూ మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్తీ సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా కాకుండా కేవలం రౌడీయిజంతో కారుమూరి మాట్లాడిన తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజలు హర్షించే విధంగా మాట్లాడాలి తప్ప నరికేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.


