చిన్నారులకు పోషకాహారంతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులను మెరుగుపరిచి వాటిని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని నియోజకవర్గంలోని 211 అంగన్వాడీ కేంద్రాలకు కిచెన్ కిట్లు, టీచర్లు, ఆయాలకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడూతూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల (హెల్పర్స్) శ్రమను తగ్గించి, వంట ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు గ్యాస్ ఆదా అయ్యేలా ఒక్కో కేంద్రానికి ఒక ఇండక్షన్ స్టవ్, దానికి అవసరమైన ప్రత్యేక వంట పాత్రలతో కూడిన సామగ్రిని అందజేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిడదవోలు మండలంలోని 83 సెంటర్లు, పెరవలి లోని 65 సెంటర్లు, ఉండ్రాజవరం లోని 63 సెంటర్లకు ఈ కిట్ల పంపిణీ చేశామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల చిన్నారులకు అంగన్వాడీల ద్వారా ప్రాథమిక స్థాయిలోనే బలవర్ధకమైన పోషకాహారం అందిస్తూ, వారి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన మంత్రి దుర్గేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభ్యాసానికి బలమైన పునాది అయిన ఈ కేంద్రాలను తిరిగి పట్టాలెక్కిస్తోందన్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోషకాహార లోపంతో బలహీనపడకూడదని, విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పాఠశాల విద్యలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.



