రైతుల్లో నూతనోత్సాహం నింపిన ఏరువాక
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
సాంకేతికతతో వ్యవసాయం మరింత లాభదాయకం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
మండపాక గ్రామంలో ఏరువాక పౌర్ణమి ప్రారంభం
ఎడ్లబండితో దుక్కి దున్నిన కలెక్టర్, ఎమ్మెల్యే
ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన వైనం
ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చిన కలెక్టర్, ఎమ్మెల్యే
తణుకు మండలం మండపాక గ్రామంలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగింపుగా సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం వ్యవసాయ క్షేత్రంలో భూమి పూజ, నాగలి పూజ, ఎడ్ల పూజ నిర్వహించారు. అనంతరం ఎడ్లతో భూమిని దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ట్రాక్టర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యేలు స్వయంగా నడిపి దుక్కి దున్నడంతో రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏరువాక పౌర్ణమిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం రైతాంగానికి గౌరవప్రదమైన విషయమన్నారు. సంప్రదాయ వ్యవసాయ ఆచారాలను కొనసాగించడం ద్వారా ప్రకృతి కూడా అనుకూలిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఎంతో శ్రమించి ప్రపంచానికి ఆహార భద్రత కల్పిస్తున్నారని, వారి సేవలకు తన పాదాభివందనాలు తెలియజేశారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి, సకాలంలో రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేస్తున్నామని తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, తణుకు నియోజకవర్గంలోనే 1.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.1,030 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 24 నుంచి 48 గంటల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 42 వ్యవసాయ డ్రోన్లలో 11 డ్రోన్లు తణుకు నియోజకవర్గానికే రావడం సంతోషకరమన్నారు. రైతులు ’రైతన్న యాప్’ను డౌన్‌లోడ్ చేసుకుని మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం, అధికారుల వివరాలు వంటి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నామని, కొబ్బరి, జామ, గులాబీ తదితర తోటల అభివృద్ధికి ఉచితంగా సహాయం అందిస్తున్నామని చెప్పారు. హైడ్రోపోనిక్స్, ఆర్కిడ్ పూల సాగు, ముత్యాల ఉత్పత్తి వంటి వినూత్న వ్యవసాయ పద్ధతుల్లో రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
లాభసాటిగా వ్యవసాయం…
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు లాభసాటి వ్యవసాయం లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు, సకాలంలో చెల్లింపులు, యూరియా సరఫరా, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయంలో సాంకేతికతను మరింత విçస్తృతంగా వినియోగించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువతకు డ్రోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, ఆధునిక పాస్‌బుక్స్, సాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మరింత భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఏడిఏ నరేంద్ర, తణుకు, అత్తిలి ఏఎంసీ చైర్మన్లు కొండేటి శివ, దాసం ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్లు వి.మోహన్, అత్తిలి రామాంజనేయులు, సొసైటీ చైర్మన్ ఆత్మకూరి రామకృష్ణ, గ్రంధాలయం డైరెక్టర్ విశాలి, సాగునీటి సంఘం డిసి ఎల్లపు రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి, కూటమి నాయకులు పరిమి వెంకన్న బాబు, చిక్కాల వేణు, వ్యవసాయ శాఖ ఏవోలు, వివోలు, రైతులు, వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



