స్వామివారి 19వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహణ
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి 19వ వార్షికోత్సవ వేడుకలకురాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు మంత్రి కందుల దుర్గేష్ కి సాదర స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రికి ప్రసిద్ధ క్షేత్రమైన కోటసత్తెమ్మ తల్లి అమ్మవారి చిత్రపటాన్ని, స్వామివారి తీర్థప్రసాదాలను అత్యంత గౌరవంతో బహుకరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..”నిరంతరం రామనామ స్మరణతో భక్తులను అనుగ్రహించే ఆంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవాల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. ధైర్యానికి, భక్తికి, నిస్వార్థ సేవకు మారుపేరు హనుమంతుడు. ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి.రావిమెట్ల గ్రామంలో గత 19 ఏళ్లుగా ఇంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం. ఆ కంటికి రెప్పలా కాపాడే వీరాంజనేయుడు, కోటసత్తెమ్మ తల్లి ఆశీస్సులు మన నియోజకవర్గ ప్రజల పైన, రాష్ట్ర ప్రజల పైన ఎల్లప్పుడూ ఉండాలని, అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.”
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గోడే రమేష్ సోదరి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని తెలిసి వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు.



