బీజేపీ అధికార ప్రతినిధి – డా. ముళ్ళపూడి రేణుక ఫైర్
తణుకు, మే 12:
తణుకు పట్టణంలోని చిట్టూరి హెరిటేజ్ హోటల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవంగా చూస్తున్న ఈ సమయంలో దేశ నాయకుడిని ఎగతాళి చేయడం అంటే దేశ ప్రజలను అవమానించినట్టేనని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చిన పెట్టుబడిదారులను వెనక్కి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. ఉద్యోగాల కొరతతో యువత నిరాశలోకి వెళ్లిందని, అభివృద్ధి అనే మాట వినిపించకుండా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని ఆరోపించారు.
ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పుడు చౌకబారు విమర్శలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
“తమ పాలనలో రాష్ట్రానికి ఏమి చేసామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న పేర్ని నాని, ఇప్పుడు దేశ ప్రధానమంత్రిని విమర్శించడం హాస్యాస్పదంగా మారింది. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేని వారు వ్యక్తిగత విమర్శల వెనుక దాక్కోవడం దౌర్భాగ్యం” అని వ్యాఖ్యానించారు.
దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూ, భద్రతా రంగం నుంచి ఆర్థిక రంగం వరకు భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్న నాయకుడిపై అవగాహన లేకుండా మాట్లాడటం రాజకీయ అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. ప్రధానమంత్రి పై చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. “వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను మర్చిపోలేరు. ప్రజా వ్యతిరేక పాలన చేసి తిరస్కరణ ఎదుర్కొన్న నాయకులు ఇప్పుడు విమర్శలతో రాజకీయ ప్రాధాన్యత పొందాలని చూస్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అని అన్నారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానిపై వ్యక్తిగత స్థాయిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమని, రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చుగానీ వ్యక్తిత్వ హననం చేయడం సమంజసం కాదని బిజెపి నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కొడమంచిలి జితేంద్ర, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి యన్నమని రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు పూలమాల వీరభద్రం, రాకేష్, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి రాసా బత్తుల అనుకుమార్, పార్టీ నాయకులు బలబద్ర నాగ సూర్య ప్రకాష్ గుప్తా పాల్గొన్నారు.



