తన బాబాయ్ జీవిత కథ ఆధారంగా చేసుకుని నిర్మించిన ప్రేమ కథ చిత్రం ‘గోదారి గట్టుపైన’ అని చిత్ర దర్శకుడు సుభాష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా సోమవారం తణుకు శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో చిత్ర యూనిట్ హల్ చల్ చేశారు. ఈ సినిమా కేవలం తణుకు పరిసర ప్రాంతంలోనే షూట్ చేసుకోవడం కాకుండా తణుకు పరిసర ప్రాంతానికి చెందిన అనేక మంది నటులు ఈ చిత్రంలో నటించడం జరిగిందని దర్శకుడు తెలిపారు. హైదరాబాద్ అబ్బాయి హీరో, కేరళ అమ్మాయి హీరోయిన్ గా నటించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ చిత్రం నేటి యువతను, కులం, మతం పేరుతో కన్నబిడ్డల ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులకు కనువిప్పుగా చెప్పుకోవచ్చు. టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలను ఈ చిత్రం అలరిస్తుందని తెలిపారు. చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో స్క్రీన్ ల సంఖ్య పెంచడం జరిగిందని డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. ఈ చిత్ర దర్శకులు సుభాష్ చంద్ర, హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్ ల ప్రసంగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమనీ, కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య గల ప్రేమానురాగాలు, బంధాలు, అనుబంధాలు కళ్ళకు కట్టినట్లు చూపించారని ప్రేక్షకులు చిత్ర యూనిట్ ను కొనియాడారు. ఈ విజయోత్సవ వేడుకలో హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్, డైరెక్టర్ సుభాష్ చంద్ర, ఇతర నటీ నటులు, ఈ చిత్రంలో నటించిన తణుకు ప్రాంత నటులు వై.టి.మూర్తి, కోట రామ ప్రసాద్, ఎస్. దొర బాబు, పురాణపండ జోగయ్య శాస్త్రి, చిత్ర డిస్ట్రిబ్యూటర్ గోళ్ళ ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర థియేటర్ మేనేజర్ కానూరి రాంబాబు, ప్రేక్షక మహాశయులు పాల్గొన్నారు.




