78 మందికి రూ. 61.33 లక్షలు చెక్కులు అందజేత
ఇప్పటివరకు 1004 మందికి రూ. 7కోట్లు.50లక్ష లకు పైగా పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి 78 మంది బాధితులకు రూ. 61.33 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాధాకృష్ణ గురువారం అందజేసి మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి ఆర్థికంగా చేయూత ఇస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో 1004 మందికి రూ. 7.63 కోట్లు మేర ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లబ్ధిదారులకు అందించినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సేవలో సరైన సమయంలో వైద్యం పొందలేని పరిస్థితుల్లో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారిని ఆదుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద మనసుతో బాధితులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి నుంచి నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తణుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీఎం సహాయనిది నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఏ కుటుంబానికీ ఆర్థిక సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం వైద్య సదుపాయాలు మెరుగుపరిచి అందుకు అనుగుణంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అధునాతన పరికరాలు సమకూర్చడంతో పాటు సిబ్బంది నియామకాన్ని మరింత వేగవంతంగా పెంచి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



