ఏప్రియల్, 30, 2026 : హాస్యరస ప్రధానమైన సినిమాలు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తాను ముప్పై ఐదు సినిమాలు నటించి సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించినట్లు ప్రముఖ సినీ హీరో,”పద్మశ్రీ”, “నట కిరీటి”, “హాస్య కిరీటి”, డా. గద్దె రాజేంద్రప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లోని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఫంక్షన్ హాల్ లో సోమవారం రాత్రి ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన బల్లెం సినీ “మా” మీడియా డైరెక్టరీ ద్వి దశాబ్ది పుస్తకావిష్కరణ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మరో ముఖ్య అతిథి, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, తాను దర్శకత్వం వహించిన హాస్యరస భరితమైన డెబ్భై ఎనిమిది సినిమాల్లో, ముప్పై ఐదు సినిమాలు సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ తో చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ, మా ఇరువురిదీ హిట్ కాంబినేషన్ అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గత ఇరవై సంవత్సరాలుగా ఒకే సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ నటించిన వివిధ సినిమాల్లోని ముఖ చిత్రాలతో, దర్శక నిర్మాత, హీరో, రచయిత ఆల్ రౌండర్ స్టార్ గా ప్రసిద్ధులైన బల్లెం వేణుమాధవ్ ప్రచురిస్తున్న బల్లెం సినీ “మా” డైరెక్టరీ ద్వి దశాబ్ది పుస్తకావిష్కరణ ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా కోట రామ ప్రసాద్ ను సినీ హీరో, పద్మశ్రీ డా.రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఇరువురూ కలిసి సత్కరించి, “బల్లెం విశిష్ఠ పురస్కారం” అందజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, పాలంగి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామ ప్రసాద్ ను ప్రముఖ సినీ హీరో, పద్మశ్రీ డా.రాజేంద్ర ప్రసాద్ దుశ్శాలువా, టోపీ, పూలమాలతో సత్కరించగా, ప్రముఖ సినీ హీరో రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఇద్దరూ కలిసి జ్ఞాపికను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా తనకు జరిగిన సత్కారానికి కోట రామ ప్రసాద్, ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్, ప్రముఖ సినీ హీరో రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు కు తమ ధన్యవాదములు, కృతజ్ఞతాభివందనములు, కళాభివందనములు తెలియ జేశారు.


