గత ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ పేరుతో సాక్షి క్యాలెండర్ విడుదల చేసిన జగన్

ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం

ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

తణుకు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

నిరుద్యోగులకు అండగా ఉంటూ వారి ఆశల ఆకాంక్షలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం కేవలం కూటమి ప్రభుత్వానికి దక్కిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ప్రతి నెల అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించడంతోపాటు మార్చి నెలలో సంక్షేమం పండుగను నిర్వహించుకోవడం గర్వకారణమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ క్యాలెండర్ చంద్రబాబు నాయుడు ఉగాది రోజున ప్రకటించడం అభినందనీయమని అన్నారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం వాలంటీర్లు నియామకం చేపట్టి లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి సాక్షి క్యాలెండర్ విడుదల చేశారని విమర్శించారు రాష్ట్రంలో 36 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను జగన్మోహన్ రెడ్డి పణగా పెట్టారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మార్చి నెలలోనే అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా మహిళలకు సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దాదాపు రూ. 10 లక్షల కోట్లు రుణాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. గతంలో యువగళం పాదయాత్రలో నిరుద్యోగుల గళాన్ని విని మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.ఇచ్చిన హామీకు అనుగుణంగా స్పష్టమైన టైం టేబుల్ తో ఉగాది రోజున 10,060 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులందరికీ పెద్దన్నలా లోకేష్ నిలిచారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలలలోనే ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో దాదాపు 6.50 లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. అనేక కేసులను అధిగమించి అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 16 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయడం జరిగిందని అన్నారు. పోలీసు శాఖతోపాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు 30 వేలు మేర ఇప్పటికే భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు. దేశంలో వంద రూపాయలు పెట్టుబడి పెడుతుంటే 25 రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, 2.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్లలో యువత విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్న దుర్మార్గుడు అని అన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రానీయకుండా పారిశ్రామికవేత్తలను సైతం అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సైతం వెళ్ళగొట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు స్తంభాలుగా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link