1500 కుటుంబాలకు రంజాన్ తోఫా
అత్తిలిలో ఇఫ్తార్ విందులో రాధాకృష్ణ హామీ
నియోజవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
***మత సామరస్యాన్ని కాపాడుతూ అకుంఠితమైన దీక్షతో ముస్లింలు ఉపవాసం ఉండి అల్లా ఆశీస్సులు సమాజానికి తోడుగా ఉండాలని ముస్లిం సోదరులు కోరుకుంటారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం అత్తిలిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు నేతృత్వంలో షాదీఖానాలు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అత్తిలి షాదీఖానా పునర్నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత టిడిపి ప్రభుత్వ హాయంలో హైదరాబాదులో మక్కా భవనం నిర్మించి ప్రస్తుతం గుంటూరులో నూతనంగా మక్కా భవనం నిర్మించారని గుర్తు చేశారు. మక్కా వెళ్లే ముస్లిం సోదరులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో ప్రతి ఏటా అందిస్తున్నట్లుగానే దాదాపు 1500 కుటుంబాలకు రంజాన్ తోఫాను ఈ ఏడాది కూడా అందించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా తన సొంత ఖర్చుల నుంచి రంజాన్ తోఫాను ప్రతి కుంటుంబానికి అందజేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




