ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలకు సత్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం తణుకులో ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో నియోజకవర్గస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తణుకు ఎస్.కె.ఎస్.డి.మహిళా కళాశాలలో నిర్వహించారు. నియోజకవవర్గ ప్రత్యేక అధికారి జి.సీహెచ్.ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది మహిళలు హాజరయ్యారు. తణుకు పట్టణంతోపాటు నియోజకవర్గం నుంచి హాజరైన మహిళా ప్రజాప్రతినిధులు తమ ఉత్తేజ పూరితమైన ప్రసంగాలతో మహిళల హక్కులు మహిళల బాధ్యతలు వారి పురోభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి అనే అంశాలపై మహిళలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా అనేకమంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రతకు వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని అనేక రకాలైన సంక్షేమ పథకాలకు మహిళలని ఎంపిక చేయడం ద్వారా వారి యొక్క ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. అంతేకాకుండా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వం మహిళలను మరింత బలోపేతం చేస్తుందని తెలియజేశారు. రానున్న రోజుల్లో మహిళలకు పూర్తిగా రాజ్యాధికారం దక్కే విధంగా అందరూ ప్రయత్నించాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అనేక రంగాలలో ప్రతిభ కనబరిచిన, సామాజిక సేవ చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమమైన మహిళలను గుర్తించి పది మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ సామాజిక చైతన్యం కలిగిస్తున్న అనేకమంది ఉద్యోగులలో ఉత్తమమైన ఉద్యోగినులను గుర్తించి పది మందిని సన్మానించారు.




