తణుకులో రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధికి మరింత కృషి
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రోడ్లు అభివృద్ధి
మరోసారి కూటమి హయాంలో మరింత అభివృద్ధి
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకు పట్టణంలోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల తణుకు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా మండల, పట్టణ కమిటీల సమావేశంలో చర్చించిన అంశాలపై శుక్రవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఆయా వార్డుల్లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని చెప్పారు. గత ఏడాది మార్చి 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు వచ్చిన సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రపతి రోడ్డు సిసి రోడ్డు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. తణుకు పట్టణంలో గత 20 నెలలుగా
జరిగిన అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తులో అవసరాలను తీర్చే విధంగా చర్చించి తణుకు పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ మెమొరండం అందించినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తణుకు పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా రోడ్లు, డ్రైనేజీలు పునరుద్ధరించి మరింత ప్రయోజకరంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు నిర్మించే విధంగా ముఖ్యంగా గత తెలుగుదేశం పార్టీ హయాంలో వేల్పూరు రోడ్డులో నరేంద్ర సెంటర్ నుంచి కప్పల వెంకన్న సెంటర్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం కప్పల వెంకన్న సెంటర్ నుంచి వీరనారాయణ థియేటర్ వరకు మొదటి దశలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ చౌక్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు నిర్మించామని ప్రస్తుతం రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు వరకు సిసి రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో హైవే వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి డీఎల్కే రోడ్డు నిర్మాణానికి రూ. 3.60 కోట్లు మంజూరు అవుతున్నాయని తెలిపారు. తణుకు పట్టణంలోని ప్రధాన రోడ్లు సిమెంట్ రోడ్లుగా మార్చే విధంగా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తణుకు పట్టణంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రోడ్లు విస్తరించి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. తణుకులోని సచివాలయ సిబ్బందితో కలిసి తణుకు పట్టణ కమిటీ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించి ఆయా వార్డుల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళిక చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గతంలో అభివృద్ధి సాధ్యమైందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అలాంటి అభివృద్ధి మరోసారి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వెలడించారు.


