:- మంత్రి కందుల దుర్గేష్
అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ
కోటసత్తెమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని సారె సమర్పణ
నిడదవోలు పట్టణంలోని నంగాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహణ
నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ఆశీర్వదించాలని ప్రార్థన
నిడదవోలు: కోట సత్తెమ్మ ఆలయ ఆధునికీకరణ పనులు చేపట్టి గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు రూరల్ మండలంలోని తిమ్మరాజుపాలెంలో కొలువైన కోటసత్తెమ్మ తల్లి దేవాలయాన్ని తిరునాళ్ళ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. శంఖ చక్ర గద అభయ హస్త యజ్క్షోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యం కోసం కోటసత్తెమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అనంతరం నిడదవోలు పట్టణంలో వేంచేసి ఉన్న నంగాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు, పళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య కోటసత్తెమ్మ ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రి దుర్గేష్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి దుర్గేష్ తో పాటు నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ఆశీర్వదించాలని స్థానికంగా కొలువైన శక్తి స్వరూపిణులు కోటసత్తెమ్మ తల్లి, నంగాలమ్మ తల్లిని మంత్రి దుర్గేష్ ప్రార్థించారు.


