:- మంత్రి కందుల దుర్గేష్
దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా
నిడదవోలు: దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తారని, త్వరలోనే దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పలువురు దివ్యాంగులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని అవయవాలు బాగుండి ఏమీ చేయలేని వారిని ఉదహరిస్తూ దివ్యాంగుడైన ర్యాలి శివ డాక్టరేట్ సాధించడం పట్ల మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేసి సంబంధిత పత్రాన్ని అందించి ప్రశంసించారు. అనంతరం దివ్యాంగుల కోసం కృషి చేస్తున్న శివ చేస్తున్న కృషిని అభివర్ణిస్తూ ఘనంగా సత్కరించారు. శివ సాధించిన డాక్టరేట్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల కోసం చేసిన సేవలను గుర్తిస్తూ మదర్ థెరిస్సా అవార్డు పొందిన వంగా కృపా వరప్రసాద్ ను మంత్రి దుర్గేష్ అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్ కేటాయించలని పలువురు చేసిన విజ్ఞప్తి మేరకు తాను మున్సిపల్ అధికారులతో మాట్లాడాలని, అతి త్వరలోనే మంజూరు అవుతుందని భరోసానిచ్చారు. ఇప్పటికే రెండు మూడు గుర్తించామని, అందులో ఒకటి కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు. దివ్యాంగుల్లో అపారమైన శక్తి సామర్థ్యం, అంతులేని ఆత్మస్థైర్యం ఉంటుందని,
అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరు అద్భుతాలు సృష్టించగలరని వారిలో ధైర్యం నింపారు. దివ్యాంగులు సైతం అన్ని రంగాల్లో తమ ప్రతిభ కనబరుస్తూ రాణిస్తున్నారని పేర్కొన్నారు.


