కానూరు శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థాన కమిటీకి మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు

ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరు

అంగరంగ వైభవంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

ఆలయ అభివృద్ధితోపాటు, సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందేందుకు దేవస్థాన కమిటీ కృషి చేయాలని సూచన

ఆలయ అభివృద్ధికి, దేవస్థానం కమిటీకి మంత్రిగా సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ

నిడదవోలు: ఆదివారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో కొలువైన శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు ఆలయ నూతన చైర్మన్,ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రి కందుల దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో శ్రీ కొండాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గా బొబ్బిలి దుర్గారావు, డైరెక్టర్లు గా టి. దుర్గాదేవి, టి. ఆంజనేయులు, కే. దొరబాబు, జె. శ్రీను, బి. నాగ త్రివేణి, టి. సీతా రామలక్ష్మి, భావన ధర్మ శేఖర్, పెద్దింటి విజయలక్ష్మి, డివివి రమణ( అర్చక ఎక్స్ అఫీషియో మెంబర్ ) తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధితోపాటు, సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందేందుకు దేవస్థాన కమిటీ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంతో ప్రాశస్త్యమున్న ఈ ఆలయ అభివృద్ధికి, దేవస్థానం కమిటీకి మంత్రిగా సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచే తల్లి కొండాలమ్మ తల్లి అన్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు ఎన్నికలకు ముందు కొండాలమ్మ దర్శనం చేసుకున్న తాను అమ్మ ఆశీర్వాదం, ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేనై అనంతరం మంత్రిని అయ్యానన్నారు. సౌమ్యుడు, దాన గుణం ఉన్న వ్యక్తి బొబ్బిలి దుర్గారావు దేవస్థాన కమిటీ చైర్మన్ గా పనిచేసేందుకు నూటికి నూరు శాతం అర్హులని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు.

రాబోయే రోజుల్లో కానూరు గ్రామాన్ని, నిడదవోలు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కానూరు- ఉసులుమర్రు రోడ్డు సీసీ రోడ్డు పనులు ప్రారంభించామని, అదే రోడ్డు పనులను పెరవలి వరకు పొడిగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 16 నెలల కాలంలో రూ. 3 కోట్ల పై చిలుకు ముఖ్యమంత్రి సహాయ నిధులు ( సీఎంఆర్ఎఫ్ ) నియోజకవర్గ ప్రజలకు అందించామని, మరీ ముఖ్యంగా కానూరు గ్రామానికి అత్యధికంగా అందించినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రజా రాజధాని అమరావతిని గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వ నేతలు నీరుగార్చారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్ధత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తిరిగి రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టామని, పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని మంత్రి దుర్గేష్ వివరించారు. వాటిని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీల కలయికతో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పరుగులు పెడుతోందన్నారు. కూటమిలో అందరూ ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి కారకులవుదామన్నారు.

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అడిగిన వెంటనే రాష్ట్రంలోనే తొలిసారి నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 11 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిడదవోలు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తద్వారా నియోజకవర్గంలో పుంత రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపడతామన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆర్ అండ్ బి నిధులతో చేపట్టిన చివటం రోడ్డును చూసి స్థానిక ప్రజలు ధన్యవాదాలు చెప్పారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు, అది ప్రజలకు సత్ఫలితాలు అందించినప్పుడే రాజకీయ నాయకుడిగా తమకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా ఇచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కు కృతజ్ఞతలు చెబుతూ త్వరలోనే ఆ హోదాలో పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆర్ఓబి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేయడం తనకు దొరికిన అదృష్టమని మంత్రి దుర్గేష్ అన్నారు.

Scroll to Top
Share via
Copy link