:- మంత్రి కందుల దుర్గేష్
రాబోయే రోజుల్లో నిడదవోలు మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి
నేటి నుండి నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా అమలవుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజాసేవకుడిగా పనిచేస్తానని మంత్రి కందుల దుర్గేష్ మరో మారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 1967 నుండి ఇప్పటి వరకు ఆరు దశాబ్దాలుగా నిడదవోలు పురపాలక సంఘానికి విశేష సేవలు అందించిన పురపాలక సంఘ చైర్ పర్సన్స్ జాబితాతో కూడిన శిలాఫలకాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అనంతరం పురపాలక సంఘ సిబ్బందికి, పీ హెచ్, నాన్ పీ హెచ్ కార్మికులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు, మెడల్స్, నూతన వస్త్రాలు ప్రధానం చేశారు.
1964 లో ఏర్పాటైన నిడదవోలు మున్సిపాలిటీకి 2025 డిసెంబర్ 1 కి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసిన పురపాలక శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు, పౌరసరపరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు, తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహించారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి, నృత్య రీతులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయని అన్నారు. ఈ వజ్రోత్సవ వేడుకలు తమలో నూతనోత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు. నాయకులకు, అధికారులకు ఈ వేడుకలు స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. 60 ఏళ్ల నుండి నిడదవోలు మున్సిపాలిటీకి సేవలు అందించి అభివృద్ధిలో భాగస్వామ్యులైన వారికి, పట్టణ ఔన్నత్యాన్ని పెంచిన మున్సిపల్ చైర్మన్లు, వారి కుటుంబ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు ఇలా ప్రతి ఒక్కరిని సత్కరించామన్నారు. తద్వారా ప్రజానీకానికి మంచి సందేశం ఇచ్చామని భావిస్తున్నామన్నారు.
తొలి రోజు వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసిన మంత్రి నారాయణను విజ్ఞప్తి చేసి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉన్న నిడదవోలుకు స్పెషల్ గ్రేడ్ హోదా సాధించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వజ్రోత్సవ వేడుకల ముగింపు రోజున సంబంధిత జీవో, రాజ పత్రాన్ని విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. నేటి నుండి నిడదవోలు మునిసిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా అమల్లోకి వచ్చిందన్నారు. ఇందులో భాగస్వామ్యులైన అన్ని రాజకీయ పార్టీలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు, వామపక్ష పార్టీలకు, నిడదవోలు ప్రజానీకానికి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసి రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.


