నిడదవోలు మున్సిపాలిటీకి “స్పెషల్ గ్రేడ్” హోదా

గత మూడేళ్ల ఆదాయం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం.. మంత్రి కందుల దుర్గేష్ హర్షం

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నవంబర్ 28: నిడదవోలు పురపాలక సంఘం చరిత్రలో మరో కీలక మైలురాయి దాటింది. గత మూడేళ్లుగా మున్సిపాలిటీకి పెరిగిన ఆదాయం, ఇతర అభివృద్ధి ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, నిడదవోలును ‘గ్రేడ్‌-2’ నుంచి ‘స్పెషల్‌ గ్రేడ్’ (Special Grade) మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ గురువారం కీలక ఉత్తర్వులు (G.O.Ms.No. 242) జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ జీవోలో పేర్కొన్నారు.

నిడదవోలు మున్సిపాలిటీ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం నిడదవోలు పట్టణంలో వజ్రోత్సవ (డైమండ్ జూబ్లీ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ గారి దృష్టికి, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మున్సిపాలిటీ హోదాను గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1 కి మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారాయణ, వజ్రోత్సవ వేడుకలు పూర్తయ్యేలోగా (నవంబర్ 28 సాయంత్రం నాటికి) హోదా పెంపుపై ఉత్తర్వులు జారీ చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, నిర్ణీత సమయంలోనే ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

నిడదవోలు అభివృద్ధికి బాటలు వేస్తూ స్పెషల్ గ్రేడ్ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి నారాయణకు నిడదవోలు ప్రజల తరఫున మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదే ఉత్తర్వుల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని కూడా గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1కు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Scroll to Top
Share via
Copy link