:- మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు ఆర్వోబి పూర్తికి జల వనరుల శాఖ తరపున అవసరమైన తోడ్పాటు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన
నిడదవోలు పట్టణ అభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ నిరంతర కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి
నిడదవోలు: రాష్ట్రంలోనే నిడదవోలును ఆదర్శ నియోజకవర్గంగా, అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్థానిక ఐ లవ్ నిడదవోలు పార్క్ సెంటర్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలుకు సమగ్ర స్వరూపం తీసుకొస్తామని అన్నారు. నిడదవోలు పట్టణంలో రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి సరైన కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. తద్వారా నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేయాలన్న సదుద్దేశంతో, పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. గడిచిన 60 ఏళ్లలో ఎంతోమంది ప్రజా ప్రతినిధులు, చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇలాంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల మాదిరి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
తొలుత రాష్ట్రంలోని 20 లక్షల యువతకు ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావించారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. సంబంధిత ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో తాను ఒక సభ్యుడునని గుర్తు చేస్తూ ఐదేళ్లు పూర్తయ్యే నాటికి 20 కాదు 30 లక్షల యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాతిపదికను రూపొందించామని, ఇటీవల వైజాగ్ లో జరిగిన సిఐఐ సమ్మిట్ దానికి నాంది పలికింది అన్నారు. ఈ పార్ట్ నర్ షిప్ సమ్మిట్లో దాదాపు 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా అనేక ఉద్యోగాల కల్పనకు వీలు కలుగుతుందన్నారు.
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో తొలుత రాజమహేంద్రవరం, కడియం సమీప ప్రాంతాలు ఉంటే సంబంధిత డిపిఆర్ ను మార్పించి నిడదవోలును అందులో అంతర్భాగం చేయించానని, తద్వారా స్థానికంగా ఉన్న నంగాలమ్మ, కోట సత్తెమ్మ తల్లి ఆలయాలను, బోటింగ్, వే సైడ్ రెస్టారెంట్ తదితర పర్యాటక ఇతర ప్రదేశాలను రూ. 3 కోట్లతో అభివృద్ధి చేయనున్నామన్నారు. కేంద్ర సహకారంతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు అమృత్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, వారి చొరవతో అప్పారావు కెనాల్ ద్వారా గోదావరి జలాలను శుద్ధిచేసి నిడదవోలు ప్రజలకు తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం చిన్న కాశి రేవు వద్ద వంతెన నిర్మాణం చేపడతామన్నారు.
2014లో సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో, నాటి నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కృషితో నిడదవోలు పట్టణానికి ఆర్ఓబి మంజూరు అయిందని, గడిచిన ఏడాదిన్నర కాలంగా సంబంధిత పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. గడిచిన 5 ఏళ్లకాలంగా ఆర్వోబి పనులు నత్త నడకన సాగాయన్నారు. పాదచారులు, వాహనదారుల ఇక్కట్లకు చెక్ పెట్టేలా మార్చి నాటికి ఆర్వోబి పూర్తి చేసేలా చర్యలు చేపట్టానన్నారు. ఈ విషయం లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకరించాలని, ఆర్వోబి పనులకు ఆటంకం కలగకుండా ఇంజనీర్స్, కలెక్టర్ తో మాట్లాడి కాలువలో కొంతకాలం నీరు ఆపేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా
మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతం నిడదవోలు అని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో, మంత్రి దుర్గేష్ సారధ్యంలో నిడదవోలు అభివృద్ధి చెందుతుంది అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ పట్టుదలతో జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను శుద్ధి చేసి నిడదవోలు పట్టణానికి మంచినీరు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని, గ్రేడ్ 2 మున్సిపాలిటీ గా ఉన్న నిడదవోలును మంత్రి నారాయణతో చర్చించి గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మంత్రి దుర్గేష్ చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు. నిడదవోలు ప్రజల చిరకాల కోరిక అయిన ఆర్వోబి పనులను శరవేగంగా జరిపించడంలో మంత్రి కందుల దుర్గేష్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ప్రశంసనీయమన్నారు. ఆర్వోబి పూర్తయ్యేందుకు జల వనరుల శాఖ తరపున అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలుకు మంత్రి కందుల దుర్గేష్ దొరకడం అదృష్టమని అభివర్ణించారు. పర్యాటక శాఖ మంత్రిగా మంత్రి కందుల దుర్గేష్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు.
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదన్నారు. నాడు 200 రూపాయల పెన్షన్ ను 2000 చేసింది చంద్రబాబు నాయుడు అన్న విషయం మర్చిపోవద్దన్నారు. ఆ 2000 పెన్షన్ 3000 చేసేందుకు గత ప్రభుత్వాధినేతకు ఐదేళ్ల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 కు పెంచామని గుర్తు చేశారు. దివ్యాంగులకు మూడు వేల నుండి 6000 కి పెన్షన్ పెంచామని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న ఘనత తమదన్నారు. ఏపీలో ఇస్తున్న రూ. 4000 పెన్షన్,6000 పెన్షన్, 10000 పెన్షన్, 15000 పెన్షన్
29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. తల్లికి వందనం ద్వారా 15 వేల రూపాయలు, అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన ద్వారా 20,000 రూపాయలు రైతులకు సాయం అందిస్తున్నామన్నారు. మహిళా సోదరీ మణులకు స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. తద్వారా ఆటో డ్రైవర్లకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారికి 15 వేల రూపాయలు అందిస్తున్నామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద 20 వేల రూపాయలు అందిస్తున్నామని వెల్లడించారు. 16 వేలపైగా మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. రోజుకు 4 లక్షల మందికి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెడుతున్నామన్నారు. ఓవైపు సంక్షేమం అందిస్తూనే మరోవైపు రాజధాని నిర్మాణం, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. 2027 నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. 30 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇంతగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నిధులను సైతం పక్కదోవ పట్టించి మున్సిపాలిటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం ద్వారా మంజూరైన నిధులకు రాష్ట్రం నుండి మ్యాచింగ్ వాటా నిధులు ఇవ్వకపోవడం తో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా మాజీ సీఎం జగన్ ఇచ్చారన్నారు..నాడు టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేలకోట్లు దోచుకున్నారని ఆగ్రహించారు. గత ప్రభుత్వ పాలనలో రోడ్లు వేయాలన్నా, మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి పనులు చేయాలన్నా కాంట్రాక్టర్లు భయపడేవాళ్ళన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి వనరులను లూటీ చేసి దోచుకున్నారని ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వాధినేత విధ్వంసం చేసిన వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ 16 నెలల కాలంలో ప్రజల తలరాత మారుస్తున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. నాటి పాలన చూసి భయపడి రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన పరిశ్రమలను, పారిశ్రామిక వేత్తలను తిరిగి తీసుకొచ్చి, యువతకి, ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నామని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు వివరించారు.


