: మంత్రి కందుల దుర్గేష్
తాడిపర్రులో “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, భవిష్యత్ లో ఏం చేయబోతుందో చెబుతూ సీఎం రాసిన లేఖను కరపత్రాల రూపంలో పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
రూ. 15 లక్షల గోదావరి పుష్కరాల నిధులతో తాడిపర్రు గ్రామ శివాలయానికి అప్రోచ్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ
నిడదవోలు: అన్నదాతల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.నవంబర్ 24 నుండి డిసెంబర్ 2 వరకు ప్రభుత్వం రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ శనివారం నిడదవోలు నియోజకవర్గంలోని తాడిపర్రు గ్రామానికి వెళ్లి అన్నదాతలను స్వయంగా కలిశారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుకున్నారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం వ్యవసాయంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయంలో సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ మద్దతు, పాడి రైతులకు అండ, ప్రకృతి సేద్యం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పటిష్టమైన పంచ సూత్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ క్రింద అందిస్తున్న ఆర్థిక సాయం, ధాన్యం సేకరించిన 4 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ, గత ప్రభుత్వ ధాన్యం బకాయిలు విడుదల, ప్రకృతి విపత్తులకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం తదితర కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మేలును వివరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతన్నల కోసం ఇప్పటివరకు ఏం చేసింది, భవిష్యత్ లో చేయనుందో తెలిపేలా సీఎం రాసిన లేఖను కరపత్రాల రూపంలో పంపిణీ చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా రైతు సంక్షేమం అందిస్తామని తెలిపారు.రైతుకు భరోసా ఇచ్చే శాశ్వత పరిష్కారం కోసం సీఎం చంద్రబాబునాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
అనంతరం మంత్రి కందుల దుర్గేష్ తాడిపర్రులో శివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదొక శుభ సందర్భంగా అభివర్ణించారు. గ్రామస్థులంతా కలిసి ప్రధాన శివాలయంతో పాటు మొత్తం 9 ఉపాలయాల్లో 7 ఉపాలయాలు నిర్మించడం, నేడు గ్రామస్థులతో కలిసి ఆలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.ఇలాంటి అధ్యాత్మిక కార్యక్రమాల వల్ల ఐకమత్యం, భక్తి భావం పెరుగుతుందన్నారు. అంతేగాక మనస్సులు పునీతమవుతాయన్నారు. గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఒకే మాట మీద ఉంటూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం మంచి పరిణామమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తద్వారా మహాత్ముడు కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాధించగలుగుతామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల వినతి మేరకు రూ.15 లక్షల గోదావరి పుష్కర నిధులతో తాడిపర్రు గ్రామ శివాలయానికి అప్రోచ్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.


