విశాఖపట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం పాల్గొన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యానికి నేడు ముందడుగు పడిందని ఈ సందర్భంగా రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. 38 మెగా పరిశ్రమల్నీ సీఎం ప్రారంభిండం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఒక్క ఎంఎస్‌ఎంఈల ద్వారానే 5 లక్షల మంది యువతకు నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పం ఈ ఎంఎస్‌ఎంఈల ద్వారా నెరవేరుతోందని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పాలకుల వైఖరితో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతే కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీకి చలో చలో అంటూ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా రాధాకృష్ణ వెల్లడించారు.


