నిరంతర స్ఫూర్తి మంత్రం వందేమాతరం గీతం

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రేరణదాయకమైన మంత్రం వందేమాతర గీతమని పేర్కొన్న మంత్రి దుర్గేష్

దేశ స్వాతంత్ర్య సాధన సంకల్పానికి బలమైన ఊపిరులూదిన గీతాన్ని రాసిన బంకించంద్ర చటర్జీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్

విజయవాడ: భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రేరణదాయకమైన మంత్రం వందేమాతర గీతమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన 150 వసంతాల వందేమాతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకాగా, మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన సంకల్పానికి బలమైన ఊపిరులూదిన గీతాన్ని రాసిన బంకించంద్ర చటర్జీకి మంత్రి దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రతిధ్వనించిన గీతం వందేమాతరమని, ఆ గీతాన్ని రచించి నేటికి 150 వసంతాల సుందర స్వప్నం మనముందుంది అన్నారు. ఎందరిలోనో చైతన్యాన్ని రగిలించిన ఈ గీతం నేటికి 150 వసంతాలు పూర్తిచేసుకోవడం గర్వించాల్సిన విషయమన్నారు. ఈ సందర్భంగా 2025 నవంబర్ 10 నుండి 2026 నవంబర్ 10 వరకు సంవత్సరం పాటు ఈ గీతాన్ని ప్రతి పాఠశాలల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సామూహికంగా పాడి అభిమానాన్ని, గౌరవాన్ని చాటేందుకు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అసేతు హిమాచలం కూడా మనందరి గొంతులో వందేమాతరం ప్రతిధ్వనించాలని ప్రధాని నరేంద్రమోదీ అందరిలో దేశభక్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం ఆనందంగా ఉందన్నారు. పరాయి పాలనకు చరమగీతం పాడి, స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు చేసి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగధనుల కృషి వల్లే మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని, ఈ క్రమంలో స్వాతంత్ర్య ఉద్యమానికి జవజీవాలు అందించిన వందేమాతరం గీతాన్ని వినగానే దేశభక్తి ఉప్పొంగుతుందని, రోమాలు నిక్కబొడుచుకుంటాయన్నారు. జాతిని జాగృతపరిచిన ఈ వందేమాతరం అజరామరంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వాతంత్ర్య సమరం ప్రారంభించిన తొలినాళ్లలో బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి అతివాద నాయకులకు, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ లాంటి మితవాదులకు జీవగర్రగా నిలిచిన ప్రధాన గీతం వందేమాతరం అని వివరించారు. నెల్సన్ మండేలా లాంటి విప్లవనాయకులు సైతం మహాత్ముడు రూపొందించిన సత్యాగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారన్నారు.యావద్భారతం స్వరాజ్య సాధనకు మూకుమ్మడిగా వేసిన అడుగులకు సరికొత్త ఉద్యమ వేదిక, స్ఫూర్తి గీతిక ‘వందేమాతరం’ అన్నారు. స్వాతంత్య్రానంతరం కూడా ‘వందేమాతరం’ నిత్యస్ఫూర్తిని రగిలిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన ఆత్మనిర్భర భారత నిర్మాణానికి మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. అటువంటి వందేమాతరం గీతం కోసం కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించిన స్ఫూర్తిని ప్రత్యేకంగా తీసుకోవాలన్నారు.యువత ఈ గీతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link