తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తాము
నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్
భారీ వర్షాలు, మొంథా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న కానూరు– ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు. రోడ్డు బాగా దెబ్బతిన్నదని, రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి అనుమతులు, నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రతిసారి రోడ్డు దెబ్బ తింటున్నందున ఈసారి సిమెంట్ రోడ్ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశామని, ఆయన అంగీకరించారని మంత్రి వివరించారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.
రూ.3.24 కోట్లతో వడ్లూరు–తీపర్రు రోడ్డును (చివటం, ఉండ్రాజవరం, తాడిపర్రు గ్రామాలను కలుపుతూ) మంజూరు చేయించామని తెలిపారు. పనులు ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్నాయని చెప్పారు.కాల్దారి రోడ్డుకు రూ.60 లక్షలు, కానూరు– లంకలకోడేరు రోడ్డుకు రూ.4.20 కోట్లు మంజూరైనట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తా మన్నారు.
ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో చర్చించి రూ.8.30 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణాలకు అనుమతులు తెచ్చామని తెలిపారు.
అందులో భాగంగా.రూ.4.15 కోట్లతో ఖండవల్లి–ముక్కామల రోడ్డు, రూ.4.15 కోట్లతో దువ్వు–తీతలి–మునిపల్లి రోడ్ నిర్మించనున్నట్లు వివరించారు. సూర్యారావు పాలెం, పసలపూడి గ్రామాలకు కొత్త రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఇవి కాకుండా, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూ.11 కోట్లతో గ్రామాల్లో అంతర్గత రోడ్లు బాగు చేశామని, ఇటీవల మరో రూ.5 కోట్లు మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు.
మరో నెల రోజుల్లో పుంత రోడ్లు, డ్రైన్లు బాగు చేసే చర్యలు తీసుకుంటా మన్నారు. ఆ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో రోడ్లు పూర్తిగా నాశనమయ్యాయని విమర్శించారు. కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం ప్రారంభించి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లకు అనుమతులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.


