తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాలులో ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా సమితి సమావేశం – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు
తణుకు,అక్టోబరు 23
జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్థ్య, సెక్యూరిటీ, క్వెస్ట్ కంట్రోల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి వేతనబకాయిలు, పి.ఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కోనాల భీమారావు డిమాండ్ చేసారు. గురువారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశానికి భీమారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ జిల్లాలో గత 20 ఏళ్ళ క్రితం 30 పడకలగా వున్న అనేక హాస్పిటల్స్ 30 నుంచి 50,100,150 పడకలకు విస్తరించడం జరిగిందని,అనేక నూతన భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. హాస్పిటల్స్ స్థాయి పెరిగిన పడకలు, నూతన భవనాలకనుగుణంగా పారిశుధ్య కార్మికుల పెంపు జరుగలేదన్నారు. దీంతో తీవ్ర పనిభారంతో కార్మికులు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు.కొన్ని హాస్పిటల్స్ లో వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.సెక్యూరిటీ కార్మికుల వేతనాల చెల్లింపులో కాంటాక్టరు ఒక్కో కార్మికుడు నుంచి ప్రతీ నెలా 2 వేలు రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు. ఇంకా అనేక సమస్యలతో కాంట్రాక్టు కార్మికులు సతమతమవుతూ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.వీరి స్థితిగతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని భీమారావు కోరారు.
ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా నూతన సమితి ఎన్నిక
ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పశ్చిమగోదావరి జిల్లా నూతన సమితిని సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూనియన్ జిల్లా అధ్యక్షునిగా కోనాల భీమారావు, ప్రధాన కార్యదర్శిగా బందా సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ముదునూరి శ్రీహరి రంగరాజు, కోశాధికారిగా వసంతాడ వీరాస్వామి, ఉపాధ్యక్షులుగా కస్పా లక్ష్మినారాయణ, కె.కృష్ణకుమారి, సహాయ కార్యదర్శులుగా అడ్డాల వెంకటలక్ష్మి, బి.వెంకటలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులుగా మొగలాపు సుధారాణి, టి.శారమ్మ, పి.దానేశ్వరి, ఎలిపే హైమావతి, మెరిపే బేబి, సీహెచ్. రాజశేఖర్, బి. మంగతాయారు, సీహెచ్ కుమారి, బి.శాంతకుమారి, జి.రవిప్రసాద్, పి.రమేష్ బాబు, పేకేటి రవికుమార్, డి.పుష్పలత, పంపన రేణుక, భారతి ఎన్నికయ్యారు.


