తణుకు ఆరిమిల్లి ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడి
ఏపీజేఎంఏ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు గమిని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం.ఎస్.ఆర్. ఆంజనేయులు (ప్రగతి రాజా) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య కీలక దశ అని ఈ సమయంలో విద్యార్థుల పట్ల అధ్యాపకులు శ్రద్ధ తీసుకోవడం ద్వారానే ఉత్తమ పౌరులుగా తయారవుతారని చెప్పారు. గత ప్రభుత్వం విధానాల కారణంగా విద్యా వ్యవస్థ ఇబ్బందులు పాలైందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. స్కూలు విద్య నుంచి కళాశాల విద్య వరకు నాణ్యమైన విద్య అందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చేది విధంగా ప్రైవేటు కళాశాలకు చెందిన యాజమాన్యాలు విశేష కృషి చేస్తున్నాయని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్న అధ్యాపకులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఐఈవో గొల్ల ప్రభాకర్, అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వ్యవస్థాపకులు లక్కీనేని ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకట ప్రసాద్, అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వరరావు, జి.సాంబశివరావు డి.ప్రభాకర్, ఎస్.సి.శేఖర్ రావు, వై. శివ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


