నిడదవోలు పట్టణంలోని లయన్స్ క్లబ్లో మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేలాదిగా తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు, అభిమానులు మంత్రి దుర్గేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు ర్యాలీగా వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ లయన్స్ క్లబ్‌కి చేరుకోగానే సర్వమత ప్రార్థనలతో వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేశారు.
కార్యక్రమ స్థలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, అభిమానులు ఆలపించిన పాటలు వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి. సభా ప్రాంగణంలో మంత్రిని ఆత్మీయంగా కలిసిన ప్రజలు ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులు, అభిమానమే తనకు పెద్ద బలం అని, ఎప్పుడూ సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం తన కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువత రక్తదానంలో ముందుండడం చూసి ఆనందంగా ఉందని అన్నారు.
అలాగే పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు తాను కృషి చేస్తానని, రాష్ట్రం కళలు, సాంప్రదాయాలు, వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


