తణుకులో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు పట్టణంలోని ఖాళీస్థలాలను తక్షణమే ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకోవాని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తణుకు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జంగం చెరువు, సంతమార్కెట్, హిందూ స్మశాన వాటిక, స్కేటింగ్ పార్కు, బ్యాంకుల కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఎన్జీవో కాలనీలోని ప్రధాన కాలువ లాకులు, రోడ్లు, డ్రైనేజీలను ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. తణుకు పట్టణంలోని ప్రధానంగా ఖాళీస్థలాలను ప్రక్షాళన చేసి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీస్థలాల్లో చెత్త పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. మరోవైపు తణుకు పట్టణంలోని ప్రధాన రోడ్లు వెంబడి ఇళ్లలో పేరుకున్న చెత్తను రోడ్లుపై వేయడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.


