యోగాతో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేసిన 250 మంది
యునైటెడ్ వరల్డ్ రికార్డు సాధించిన క్రీడాకారులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. బడ్జెట్లో సైతం క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించిన ప్రభుత్వం విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి కలిగించేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో యోగాసనాలు చేస్తూ మార్షల్ ఆర్ట్స్ నాన్చక్స్తో 250 మంది చిన్నారులు చేసిన విన్యాసాలు తణుకులో రికార్డు సృష్టించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ యువతను క్రీడల్లో రాణించేలా వారిలో నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు. త్వరలోనే ఒలంపిక్స్ క్రీడలు మన దేశంలో నిర్వహించే రోజులు రాబోతున్నాయని అందుకు అనుగుణంగా క్రీడాకారులు తయారు కావాలన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా తర్ఫీదు పొందాలని కోరారు. చిన్నారుల్లో ఆత్మసై్థర్యం నెలకొల్పేందుకు కరాటే ఉపయోగపడుతుందని ఈ కరాటేలో శిక్షణ ఇస్తున్న శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. 250 మంది కరాటే విద్యార్థులు చేసిన విన్యాసాలు యునైటెట్ వరల్డ్ రికార్డు సృష్టించారు. కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అధినేత కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. న్యాయనిర్ణేతగా విశాఖపట్టణానికి చెందిన వి.ఆర్యన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిన రాధాకృష్ణ, సన్ హాస్పటల్స్ వైద్యులు డాక్టర్ శోభాశరణ్, వేద హాస్పటల్ వైద్యులు డాక్టర్ రెడ్డి జ్యోతికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


