కోనసీమను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
రాబోయేరోజుల్లో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేలా అభినందన సభ నిర్వహించారని పేర్కొన్న మంత్రి దుర్గేష్
రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలెక్కించేందుకు పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం లు చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్న మంత్రి దుర్గేష్
రాబోయేరోజుల్లో పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామన్న మంత్రి కందుల దుర్గేష్
కేరళను మించిన అందాలున్న కోనసీమను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
వెల్లడించారు. మంగళవారం డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ అభినందన సభలో పాల్గొన్నారు.రాబోయే రోజుల్లో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేలా అభినందన సభ నిర్వహించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ను పలువురు నేతలు, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోనే అత్యంత గ్రేట్ విజనరీగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పేదల కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి, అద్భుత ప్రగతికి చిరునామాగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు.అభివృద్ధి, సంక్షేమాన్ని రంగరించి రాష్ట్రాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్న సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం,ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉండటం గర్వకారణమన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాల మేరకు పోటీ చేసి గెలిచానని, అనంతరం ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు, నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం అల్లకల్లోలమైందని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఆ పరిస్థితి నుండి మళ్లీ రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలెక్కించేందుకు పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం లు చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్నారు.విశాఖ ఉక్కు విషయంలో గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో విశాఖ ఉక్కు కర్మాగారానికి దాదాపు రూ.11,000 కోట్లు మంజూరు చేయించడం, త్వరలోనే కేపిటివ్ మైన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం గర్హనీయమన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి చేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినప్పటికీ ఉన్న కొద్ది వనరులతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా సంక్షేమం, అభివృద్ది చేపడుతోందన్నారు.ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సకాలంలో పెన్షన్ల పంపిణీ, రైతులకు అందిస్తున్న సహకారం సాహసోపేతమైనవిగా మంత్రి దుర్గేష్ తెలిపారు. హామీల అమలుకు డబ్బుతో పాటు సంకల్పబలం చాలా అవసరమన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంకల్పబలం ఉన్నకారణంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారన్నారు.
అనేక అందాలు, ప్రకృతి రమణీయత, సహజ సిద్ధమైన సౌందర్యానికి నిలయంగా ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి దుర్గేష్ అన్నారు. సుదీర్ఘ సముద్రతీరం, గోదావరి, కృష్ణా లాంటి జీవనదులు, అటవీ ప్రాంతం ఇలా అనేక ప్రత్యేకతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలరారుతోందన్నారు.గడిచిన ఐదేళ్లలో పర్యాటకాభివృద్ది కుంటుపడిందన్నారు. పర్యాటక రంగానికి సరైన ప్రమోషన్లు లేక, మన రాష్ట్ర పర్యటకాన్ని ప్రపంచానికి చూపించడంలో వెనకబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతూ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో ముందుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం నిశ్చయించిందన్నారు.అంతేగాక నూతన టూరిజం పాలసీ తీసుకొచ్చామని గుర్తుచేశారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను నూతన పర్యాటక ప్రాజెక్టులకూ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కీలకమైన పర్యాటక శాఖకు మంత్రిగా ఉన్న తాను పర్యాటక రంగ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాన్నారు. స్థానిక పర్యాటకాభివృద్ధికి ఏం చేస్తారని ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు అడగడం చూస్తుంటే అభివృద్దిపై ఆయనకున్న అవగాహన తెలుస్తుందన్నారు. స్థానికంగా త్రివేణి సంగమం, రేవు ప్రాంతాలున్నాయని, వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేయమని పలువురు కోరుతున్నారన్నారు. ప్రకృతి రమణీయత ప్రదేశాలను, పుణ్యక్షేత్రాలను, త్రివేణి సంగమం, రేవు ప్రాంతాలన్నింటిని కలిపి సర్క్యూట్ గా, హబ్ గా మార్చేందుకు సరైన ప్రతిపాదనలతో వస్తే సీఎం,డిప్యూటీ సీఎంతో చర్చించి అమలు చేద్దామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఈ అభినందన కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కృషికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. వారితో పాటు నడిచి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడే విధంగా పురస్కారాన్ని భావిస్తున్నామన్నారు.చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనతో పాటు అందరినీ నిరంతరం పనిచేయిస్తుంటారు. మంత్రిగా ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఉంటున్నానన్నారు. ఉదాహరణకు ఒక రోజు నెల్లూరులో పర్యటన ఉంటే మరుసటి రోజు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నానన్నారు.అటు నుండి విజయవాడ మళ్లీ తిరిగి నిడదవోలుకు చేరుకుంటున్నానన్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా భరోసానిచ్చారు. కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు బుచ్చిబాబు, మాజీ హోం మంత్రి, పెద్దాపురం నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కూటమి నాయకులు నాగరాజు, విజయ్, ప్రసన్న, సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


