“విధ్వంసం వైసీపీ నైజం… అభివృద్ధి కూటమి లక్ష్యం”:మంత్రి కందుల దుర్గేష్

స్థానిక ఎన్నికల భయంతోనే మాజీ సీఎం జగన్ మోహన రెడ్డి కుట్రలు..నాడు అడ్డగోలు ఏకగ్రీవాలు… నేడు ఏకగ్రీవాలపై నీతులు

ఓటమి భయంతోనే కోర్టుల చుట్టూ జగన్ తిరుగుతున్నారు…ప్రజల తీర్పును కోర్టు కేసులతో అడ్డుకోలేరు- మంత్రి దుర్గేష్ మండిపాటు

మీది బయటి రాష్ట్రాల బౌన్సర్ల బలం… మాది కోట్లాది ప్రజల విశ్వాస బలం

రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలన్నదే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, ఎన్నికలంటే ఓటమి భయం పట్టుకోవడంతో కుట్రలు పన్నుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. ఎన్నికలు జరగడం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని ఈ నేపథ్యంలోనే కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేస్తోంది వైసీపీ రౌడీమూక అని విమర్శించారు.ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వెనకాడుతోందన్నారు. ప్రజాక్షేత్రంలో ఎదురయ్యే పరాజయాన్ని న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని శనివారం మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వ్యవస్థలను విధ్వంసం చేసి నాడు ఏకగ్రీవాలను కీర్తించిన జగన్ మోహన్ రెడ్డి నేడు ఏకగ్రీవాలపై నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.2021లో వైసీపీ హయాంలో ఎన్నికలు జరిగితే అడ్డగోలు బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసిన మాట నిజం కాదా అని నిలదీశారు. గతంలో ఎన్నికలను అప్రజాస్వామికం చేసింది వైసీపీ ప్రభుత్వమని ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా చేపడుతోందని, కావాలనే బయటి రాష్ట్రాల నుండి రౌడీలను, బౌన్సర్లను రప్పించి చిచ్చు పెట్టాలని వైసీపీ చూస్తోందని ఈ క్రమంలోనే దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. సాధారణ ఎన్నికల్లో మాదిరి దారుణంగా ఓడిపోతామనే భయం జగన్ కు పట్టుకుందన్నారు. రెండున్నరేళ్ల కూటమి సుపరిపాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని, నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటు సాధిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసిందన్నారు. మేము నిజంగా అడ్డుకొని ఉంటే ఈ స్థాయిలో నామినేషన్లు వచ్చేవా అని ప్రశ్నించారు. నామినేషన్లు, ఏకగ్రీవాలపై ఒక్కొక్కటిగా వైసీపీ కుట్రలు బట్టబయలవుతున్నాయన్నారు.ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగాలన్నదే కూటమి ఉద్దేశమని కావాలనే వైసీపీ అల్లర్లను, హింసను ప్రోత్సహిస్తోందని అన్నారు. దొంగలు, దోపిడీదారులు రాజ్యమేలితే ఎలా ఉంటుందో వైసీపీ హయాంలో చూశారు కాబట్టే ప్రజలు ఆ పార్టీని 11కు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అనర్హులు కాదని తేల్చారని విమర్శించారు. అయినా కూడా వైసీపీ తన వైఖరిని మార్చుకోకుండా దివాళాకోరుతనంగా వ్యవహరిస్తోందన్నారు.

విధ్వంసానికి పితామహుడు జగన్ మోహన్ రెడ్డి కాబట్టే ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించి పాతాళానికి వెళ్లారన్నారు. రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టుల విషయంలో, యువత ఉద్యోగాల విషయంలోనూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన జగన్ మోహన్ రెడ్డి వారి రాజకీయ ప్రయోజాలకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రం వెనక్కి వెళ్లేందుకు కారణం అయిందన్నారు.ప్రజలకు మంచి చేశాం కాబట్టే కూటమిని ఆశీర్వదించమని నేరుగా ప్రజల్లోకి వెళ్లి అడుగుతున్నామన్నారు. వైసీపీలా విధ్వంసం చేయాలనుకుంటే అన్నీ ఏకగ్రీవాలు అయ్యేవని, కానీ తాము ప్రజాస్వామ్యయుత ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూనే ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కోర్టులకు వెళ్లి ఎన్నికలను అడ్డుకొని స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను అడ్డుకొని రాష్ట్రాన్ని వెనక్కి వెళ్లేలా చేస్తోంది జగన్ మోహన్ రెడ్డి అని, ప్రజా జీవితాలను, భవిష్యత్ ను వైసీపీ నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు, రాయచోటి, తంబళ్లపల్లె, తిరుపతి, కనిగిరి, అనంతపురం, ధర్మవరం తదితర ప్రాంతాల్లో అరాచకం, విధ్వంసం చేసిన వైసీపీ గుర్తింపును రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దుచేయాలని మంత్రి దుర్గేష్ కోరారు. బాధ్యులైన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీ లక్షణాలేవి వైసీపీకి లేవని రాక్షస లక్షణాలు మాత్రమే ఆ నాయకులకున్నాయని ఘాటుగా మండిపడ్డారు. తక్షణమే వైసీపీ రౌడీ మూకల అరాచకాలను అడ్డుకొని శాంతిభద్రతలను కాపాడాలన్నారు.

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని, సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయని, ప్రభుత్వ పనితీరు ప్రజలకు నచ్చింది కాబట్టే తమ విజయం తథ్యమని విశ్వసిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోతే ఏమవుతుందో వైసీపీ కంచుకోటలుగా భావిస్తున్న కడప, పులివెందుల లాంటి స్థానాలు బద్దలవుతే తెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, వారి ఆదరణ ఎవరివైపు ఉంటే వారిదే అధికారమన్నారు. కోర్టు కేసులతోనో లేక రాజకీయ ఆరోపణలతోనో ప్రజాతీర్పును అడ్డుకోలేరని మంత్రి కందుల దుర్గేష్ చెబుతూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే రాజకీయ పార్టీల అసలైన విజయంగా అభివర్ణించారు.

Scroll to Top
Share via
Copy link