కూటమి ప్రభుత్వంలో రూ. 6.65 కోట్లు అభివృద్ధి, సంక్షేమం అమలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఒక వేదికగా నిలుస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం నిర్వహించబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు గ్రామదర్శిని వినియోగం అవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. 6.15 కోట్లు విలువైన సంక్షేమ పథకాలతో పాటు రూ. 50 లక్షల అభివృద్ధి పనులు అమలు చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటింటికి సురక్షిత తగనీరు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే మూడు ఏళ్లలో తిరుపతిపురం గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి సుపరిపాలన, సంక్షేమాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి సచివాలయంలో వాట్స్అప్ నంబరు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతున్నట్లు చెప్పారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


