‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
నిడదవోలు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేసిన మంత్రి దుర్గేష్
కొత్త ఏడాది కానుకగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, సంక్షోభంలోనూ సంక్షేమమే ధ్యేయం – ఇది ప్రజా ప్రభుత్వ విజయమని మంత్రి దుర్గేష్ వెల్లడి
మంత్రి దుర్గేష్ ఆత్మీయ పలకరింపుతో హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
నిడదవోలు: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు అందించి అండగా నిలుస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం అన్నవరప్పాడు, ఉండ్రాజవరం మండలం వడ్లూరు, నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల గ్రామాల్లో మంత్రి దుర్గేష్ “ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల” పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను పేరుపేరునా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి స్వయంగా ఇంటికి వచ్చి పెన్షన్ అందించడంతో వృద్ధులు, దివ్యాంగులు భావోద్వేగానికి లోనై మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా దేశంలో పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుందని, ప్రజల ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు..
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం కావడంతో, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే (డిసెంబర్ 31న) రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేపట్టామని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచి, ఎటువంటి అవినీతికి తావులేకుండా నేరుగా ఇంటివద్దకే అందిస్తున్నామన్నారు.గత ప్రభుత్వం పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు కాలయాపన చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసిందన్నారు. దేశంలోనే పెన్షన్ల కోసం భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు.”అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రజల దీవెనలే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ గౌరవ ప్రదమైన జీవనం కల్పించడమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లక్ష్యమన్నారు.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులే కూటమి ప్రభుత్వానికి దీవెనలని, పెన్షన్లు అందుకున్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే తమకు ఆశీస్సులని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి వెలకట్టలేని బహుమానం అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
మంత్రి కందుల దుర్గేష్ ఆత్మీయ పలకరింపుతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అందించే పెన్షన్ తమకు ఎంతగానే తోడ్పాటును అందిస్తోందని లబ్ధిదారులు సంతోషించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు, కూటమి నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


