వార్షిక నిర్వహణ నిధి క్రింద గోపవరం నుండి డి.ముప్పవరం, డి. ముప్పవరం నుండి కానూరు వరకు జరుగుతున్న పనులు స్వయంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్
హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు
నిడదవోలు: మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన మాట ప్రకారం వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలు నియోజకవర్గంలో రహదారి మరమ్మత్తుల పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ చొరవతో వార్షిక నిర్వహణ నిధి (ఏఎంజీ) క్రింద నిడదవోలు నియోజకవర్గంలోని గోపవరం నుండి డి.ముప్పవరం, డి.ముప్పవరం నుండి కానూరు వరకు గోతులుగా ఉన్న రహదారికి ప్యాచ్ వర్క్ లు చేయించారు. ఆదివారం స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న రహదారి మరమ్మత్తుల పనితీరును స్వయంగా పరిశీలించి యాన్యువల్ మెయింటెనెన్స్ గ్రాంట్ క్రింద ఉన్న నిధులను వినియోగించి త్వరితగతిన రహదారి మరమ్మతుల పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా వాహనదారులకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గుంతలమయమైన రహదారి నుండి ఉపశమనం లభించడంతో గ్రామస్థులు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కళ్లెదుటే రోడ్డు పనులు శరవేగంగా జరుగుతుండటంతో హర్షం వ్యక్తం చేశారు.


