పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ

• 30వ విశాఖ సీఐఐ సమ్మిట్ లో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు .. తద్వారా 97,876 మందికి ఉపాధి

16 నెలల్లో దాదాపు 30 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాం

విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

విశాఖపట్నం: సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో 10,690 రూమ్స్ ఏర్పాటు అవుతాయన్నారు. ప్రత్యక్షంగా 34,406, పరోక్షంగా 63,470 మొత్తంగా 97,876 మందికి పర్యాటక, అతిథ్య రంగాల్లో ఉపాధి లభిస్తుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. సమ్మిట్ లో చేసుకున్న దాదాపు రూ.6,500 కోట్ల విలువైన ఎంవోయూలలో థీమ్ పార్కులు, మెరీనాలు, ఫిల్మ్ సిటీలు, వెల్ నెస్ సెంటర్లు, రోడ్డు పక్కన సౌకర్యాలు, క్రూయిజ్‌లు, అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాలపై దృష్టిసారిస్తామన్నారు. తొలిసారిగా రూ.1,860 కోట్ల విలువైన పర్యాటక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు తద్వారా 12,500 ఉద్యోగాలు వస్తాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పారిశ్రామికవేత్తల భారీ స్పందనతో పర్యాటక రంగంలో నూతనోత్తేజం వచ్చిందన్నారు.

రెండవ రోజు సమ్మిట్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తన అధ్యక్షతన పర్యాటక పెట్టుబడిదారులతో జరిగిన ప్యానల్ సెషన్ లో పెట్టుబడులపై చర్చించారు. ఆ తర్వాత ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండి ఆమ్రపాలి కాటలతో కలిసి ఇన్వెస్టర్లతో ఎంవోయూ లను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

ఏపీ పర్యాటక రంగంలో అపార అవకాశాలు..తీర ప్రాంత సౌందర్యం ఏపీ ప్రధాన ఆస్తి: మంత్రి కందుల దుర్గేష్

ఏపీలో 1053 కి.మీల విశాలమైన సముద్రతీరం ఉందని, తీర ప్రాంత సౌందర్యం ఏపీ ప్రధాన ఆస్తి అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో బీచ్ కార్యకలాపాలకు, క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 కీలకమైన కోస్టల్ సర్క్యూట్ లను అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యావరణ స్వచ్ఛత, పర్యాటకుల భద్రతే లక్ష్యంగా విశాఖలోని రుషికొండ లాంటి బ్లూఫ్లాగ్ బీచ్ తరహాలో మరిన్ని బీచ్ ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీచ్ ప్రత్యేక వాతావరణాన్ని ఉపయోగించుకొని సెయిలింగ్,మెరైన్ స్పోర్ట్స్ వృద్ధి చేస్తామన్నారు. వెల్ నెస్, ఆయుర్వేద రిట్రీట్ లు, అడ్వెంచర్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. మెరైన్, క్రూయిజ్ టూరిజంకు బాటలు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్త ఓడరేవులు అందుబాటులోకి వస్తుండటంతో తీరం వెంబడి క్రూయిజ్ కార్యకలాపాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. లగ్జరీ యాటింగ్ కు ఏపీని కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇది జాతీయ స్థాయిలోనే కాదు ఆగ్నేయాసియాతో అనుసంధానం చేస్తుందన్నారు. అదే విధంగా తిరుమల పవిత్ర కొండలను మొదలుకొని అమరావతి, తొట్ల కొండ లాంటి ప్రాచీన బౌద్ధ క్షేత్రాల వరకు అధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

మైస్ క్యాపిటల్ ఆఫ్ ది సౌత్ గా విశాఖపట్నం: మంత్రి కందుల దుర్గేష్

అంతర్జాతీయంగా రాకపోకలకు వీలుగా రాష్ట్రంలో విమానాశ్రయాలు నెలకొల్పుతుండటంతో మీటింగ్స్,ఇన్సెంటివ్స్,కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్ (మైస్) క్యాపిటల్ ఆఫ్ ది సౌత్ గా విశాఖను తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో లాజిస్టిక్ హబ్ గా విశాఖ నిలవనుందన్నారు. అదే విధంగా కన్వెన్షన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్లు వృద్ధి చేసి ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లు అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా పర్యాటక, అతిథ్య రంగాలకు స్థిరమైన ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఐటీ, ఏఐ డేటా సెంటర్లు విశాఖలో ఏర్పాటు కావడంతో మైస్ పర్యాటకం కోసం స్థిరమైన పర్యవరణ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. పర్యాటక ప్రధాన కేంద్రమైన విశాఖ సన్ రైజ్ సిటీ గా తీర్చిదిద్దుతామన్నారు.

ఇన్వెస్టర్లకు త్వరితగతిన అనుమతులు జారీ: మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్ర వేగవంతమైన, సమ్మిళిత అభివృద్ధికి పర్యాటకం కీలకమని, గేమ్ ఛేంజర్ లాంటిదని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇది గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడంతో ఊతం వచ్చిందని, నూతన పర్యాటక పాలసీ 2024-2029 పెట్టుబడిదారులను ఆకర్షించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ క్రమంలో పెట్టుబడిదారుల కేంద్రీకృత విధానాల ద్వారా ఇన్వెస్టర్లకు విద్యుత్ సబ్సిడీ, ప్రాజెక్టుకు అవసరమైన భూ కేటాయింపులు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అవకాశాలు కల్పించామని ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇన్వెస్టర్లు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. గడిచిన 15 నెలల కాలంలో దాదాపు రూ.12,000 కోట్ల పెట్టబడులు ఆకర్షించినట్లు తెలిపారు. సమ్మిట్ లో భాగంగా మరో రూ.17,973 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని మొత్తంగా దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు మంత్రి వివరించారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు త్వరితగతిన అనుమతులు జారీ చేయడంతో పాటు ప్రాజెక్టుల అమలు వేగవంతం చేస్తున్నామన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనేలా జవాబుదారీతనంతో టూరిజం టీమ్ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్ లు, హోమ్ స్టేలు, అడ్వెంచర్, కోస్టల్, క్రూయిజ్ టూరిజం, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ తదితర విభిన్న పర్యాటక ప్రక్రియలను పరిచయం చేసి పర్యాటకులకు మధురానుభూతులు కల్పించనున్నామన్నారు. 2047 నాటికి ఏపీని అగ్రగామిగా నిలిపి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

పెట్టుబడులకు,పర్యాటకులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ మ్యాప్ పై నిలబెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.

Scroll to Top
Share via
Copy link