మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనల వెల్లువ

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు

నిడదవోలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గురువారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయం సమీపంలోని గ్రీన్ పార్క్ సిటీ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ప్రజలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి మంత్రి దుర్గేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరారంభం సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో అభినందనల కోలాహలం నెలకొంది.

ప్రత్యేకించి జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మున్సిపల్ అధికారులు మరియు వివిధ శాఖల సిబ్బంది మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి దుర్గేష్ ను కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిడదవోలు అభివృద్ధిలో మంత్రి చేస్తున్న కృషిని వారు కొనియాడారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి వచ్చిన సామాన్య ప్రజలు, మహిళలు మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో మంత్రి దుర్గేష్ ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 400 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన పనులను ప్రస్తావిస్తూ, రానున్న రోజుల్లో నిడదవోలును అన్ని రంగాల్లో మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పర్యాటక రంగంలో నిడదవోలుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 2026 అందరికీ సత్ఫలితాలు ఇచ్చే సంవత్సరం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కేంద్ర సహకారం, సీఎం, డిప్యూటీ సీఎంల నాయకత్వంలో 2026లో కూటమి ప్రభుత్వం మెరుగైన సేవలందిస్తుందని తెలిపారు. చేసే ప్రతి పనిలో అందరికీ విజయం చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు.

2025 లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నూతన అధ్యాయానికి తెరతీసిందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని తద్వారా కోట్లాదిమంది ప్రజలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. 2014-19 కాలంలో పూర్తిగా కూదేలైన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందన్నారు. ఏపీని పర్యాటకుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఏడాదిలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం అన్నారు. 2025లో వచ్చిన పర్యాటక పెట్టుబడులను గ్రౌండింగ్ చేయించి ప్రగతిని చూపిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. 2047 నాటికి కేంద్రంలో వికసిత్ భారత్ ను, రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ను సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link