రైతులను అవహేళనగా మాట్లాడిన కారుమూరి
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు
తేతలిలో గోడౌన్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
గత ఐదేళ్ల అసమర్ధ వైసిపి పాలనలో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి వెళ్లిపోయారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో కనీసం రైతుల బాగోగులు పట్టించుకోకుండా సొసైటీలను స్థానిక సొసైటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. శనివారం తణుకు మండలం తేతలి గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సొసైటీ గొడౌన్ ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గోడౌను గత వైసిపి ప్రభుత్వం నిర్మాణం నిలపివేశారని, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోడౌను నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. రైతులకు ఉపయోగకరంగా సొసైటీ ఆదాయం పెంచే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సమర్ధతతో చేస్తున్న అభివృద్ధిలో భాగమన్నారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో కేవలం తమ ఆస్తులను పెంచుకోవడం తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు రైతులను అవహేళనగా మాట్లాడి కనీసం గోనెసంచులు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. ధాన్యం సేకరణలో రైతులు నానా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి కారుమూరిని నియోజకవర్గ ప్రజలు తరిమి తరిమి కొట్టారని, 2029 ఎన్నికల్లో సైతం డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు అధికారంలో ఉండే రైతుల సంక్షేమంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


