అంగన్వాడీ కేంద్రాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించాలి

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

బాలింతలు, పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంతోపాటు సాంకేతికతను అనుసంధానం చేసే విధంగా సేవలను మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీలకు 5జి సెల్ ఫోన్లను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో 251 ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 58 వేల స్మార్ట్ ఫోన్ లను అందజేస్తుందని గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సేవలు వినియోగించుకుని పిల్లలకు మరింత బలవర్ధకమైన ఆహారం అందించాలని వారి సంరక్షణ చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సుపరిపాలన అందించాలని లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. అంగన్వాడి కార్యకర్తలు, టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్వాడీల వేతనాలు పెంచినట్లు గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 50 రోజులు పైగా ధర్నాలు, నిరసనలు చేశారని వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. తణుకు నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link