సమిశ్రగూడెం బేతస్థలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
జగతికి శాంతి సందేశమిచ్చిన మహానుభావుడు ఏసు ప్రభువు అని వెల్లడి
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: ప్రేమ, కరుణకు ప్రతీకగా నిలిచిన ఏసు ప్రభువు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సోమవారం నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం బేతెస్థలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దైవజనులు మంత్రి దుర్గేష్ ను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన జీవనమార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త ఏసు ప్రభువు అని కొనియాడారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే పదాలను ఉదహరిస్తూ దుష్టులను శిక్షించాలని, శిష్టులను రక్షించాలని అంటారు కానీ తనను హింసించి శిలువ వేసిన దుష్టులను సైతం కాపాడమని చెప్పిన మహానుభావుడు ఏసుప్రభువు అని మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందన్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చిన తనపై ఏసు ప్రభువు ఆశీస్సులు కురిపించారని, ఈ క్రమంలో తాను ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాయని, అనంతరం మంత్రిని అయ్యాయని గుర్తుచేసుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంత్రిగా అవకాశం లభించిందని పేర్కొన్నారు. దార్శనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిత్యం రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలతో ఉండే తమకు దేవుడి స్తోత్రాలు వినడం వల్ల మనస్సులు పునీతమవుతామని, ఈ క్రమంలో ప్రజా సేవకు పునరంకితమయ్యేందుకు అవకాశముంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


