దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ

తణుకు నియోజవర్గంలో 36 వేల మందికి పెన్షన్లు పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే బాధ్యత కూటమిదే

18వ వార్డులో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో అమలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా 18 వ వార్డులో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా ప్రతినెల 1వ తేదీనే పేద ప్రజలకు భరోసా కల్పించే విధంగా పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు పేరుతో జగన్మోహన్ రెడ్డి రూ. 2 వేలు నుంచి రూ. 3 వేలు చేస్తానని మూడు దఫాలుగా రూ. 750 చొప్పున సంవత్సరం పెంచి అస్తవ్యస్త విధానాలతో పెన్షన్ దారులను ఇబ్బందులకు గురిచేసి మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మొదటి నెల పెంచిన పెన్షన్ అమలు చేసి ప్రభుత్వం రాకముందు మూడు నెలలు ముందుగానే పెన్షన్లు కల్పిస్తామని చెప్పిన మేరకు మొదటి నెలలో రూ. 7 వేలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 3 వేల నుంచి రూ. 4 వేలు పెంచినట్లు చెప్పారు. దివ్యాంగులకు సైతం రూ. 6 వేలు నుంచి రూ. 15 వేల వరకు పెన్షన్ పెంచి అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎక్కువ పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇప్పటివరకు 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా ప్రజల ఖాతాల్లోకి పెన్షన్లు ద్వారా అందించడం జరిగిందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 36 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరని వైయస్సార్ సిపి నాయకులు ప్రచారం చేశారని చెప్పారు. అందుకు విరుద్ధంగా ప్రతి నెల మొదటి తేదీనే సచివాలయం సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. మొదటి తేదీ సెలవు వస్తే ముందు రోజు పెన్షన్లు అందించే పరిస్థితి ఉందని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూ అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనివిధంగా మొదటి తేదీనే పెన్షన్లు అందిస్తున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link