ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
దాతలను అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దాతలు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారిని మరింత ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిలుకూరి విశ్వేశ్వరరావు సతీమణి చిలుకూరి కృష్ణవేణి జ్ఞాపకార్థం కేటాయించిన నిధులతో సజ్జాపురం 14వ నెంబర్ మున్సిపల్ స్కూలు ఆవరణలో నిర్మించిన ఆరవ ప్లాంటును ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ తల్లిదండ్రులు దొమ్మేటి గోపాలకృష్ణమూర్తి, దొమ్మేటి ఇందిరాదేవి జ్ఞాపకార్థం రూ. లక్ష అందజేశారు. ఈ సందర్భంగా గురువారం స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ దాతలను అభినందించి మాట్లాడారు. తణుకు ప్రాంతంలో ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. చిలుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో చేస్తున్న సహకారం పట్ల ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. సజ్జాపురం ప్రాంతంలో గతంలో డాక్టర్ దొమ్మేటి గోపాలకృష్ణమూర్తి, చిలుకూరి కాశీ విశ్వేశ్వర రావు, మళ్లీన రామచంద్రరావు వంటి దాతలు స్థానికంగా ఎంతో మందికి సహకారం చేస్తూ అభివృద్ధికి తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. సజ్జాపురంలోనే నాలుగు వార్డులను దత్తత చేసుకొని దాతలు అభివృద్ధి చేయడం అభినందనీయమని చెప్పారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా మెగా టీచర్ పేరెంట్ ఈవెంట్ ఏర్పాటుచేసి తద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ఇదే వరవడిని భవిష్యత్తులో కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు


