హారిక హత్య కేసులో వైసీపీ నేతల పాత్ర
కేసు పక్కదోవ పట్టించేందుకు రూ. 50 లక్షలు డీల్
పోలీసులపై ఒత్తిడి తెచ్చిన మాజీ మంత్రి కారుమూరి
తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజం
తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన ముళ్ళపూడి నాగాహారిక కేసులో అప్పటి వైసీపీ నేతలు హస్తం ఉందని తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ముమ్మాటికి ఇది రాజకీయ హత్య అని పేర్కొన్నారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తేతలి సొసైటీ అధ్యక్షుడు మట్టా వెంకట్, హారిక సమీప బంధువు ముళ్ళపూడి సతీష్ మాట్లాడారు. 2022 నవంబర్ 12న నాగ హారిక హత్య వెలుగు చూసిన వెంటనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అప్పటి పోలీసులు అనుమానితురాలు సవతి తల్లి ముళ్ళపూడి రూప, తండ్రి ముళ్ళపూడి శ్రీనులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేవలం అరగంటలోనే ఇంటికి పంపించి వేశారని గుర్తు చేశారు. ఈ కేసులో మాఫీ చేసేందుకు అప్పటి మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు వెనుక ఉండి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి సుమారు రూ. 50 లక్షలు చేతులు మారాయని ఈ వ్యవహారంలో అప్పటి వైసిపి నేత మధ్యవర్తిత్వం చేశారని పేర్కొన్నారు. ఇది హత్య అని ఆరోపించిన మృతురాలు మేనమామ, అమ్మమ్మ, తాతయ్యల నుంచి ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదని ప్రశ్నించారు. కేవలం వీఆర్వో నుంచి ఫిర్యాదు తీసుకుని ఈ కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అప్పట్లోనే పోస్టుమార్టం రిపోర్ట్ నివేదికలు వచ్చినప్పటికీ అప్పటి అధికార పార్టీ ప్రలాభాలతో బయటపెట్టనీయకుండా అడ్డుకున్నారని అన్నారు. ఈ కేసులో నిందితురాలు ముళ్ళపూడి రూప వైసిపి మండలం మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారని ఇదే సమయంలో ఆమె సోదరుడు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో చర్చలు జరిపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను సైతం ప్రలోభ పెట్టి ఈ కేసు నుంచి ఆమెను తప్పించారని ఆరోపించారు. సంఘటన జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు బయట పెట్టలేదని ప్రశ్నించారు. అప్పట్లో వ్యవస్థలను ప్రలోభ పెట్టారు కనుకే ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించి పోస్టుమార్టం రిపోర్టుతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టు బయటపెట్టడంతో హత్య కోణం బయటపడిందని అన్నారు. యువతిని హత్య చేసిన నిందితులను కాపాడేందుకు అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృషి చేశారని అన్నారు. రాజకీయంగా ఈ హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులపై ఒత్తిడి తీసుకు రాలేదని యువతి మృతి చెందిన ప్రదేశంలోనే బహిరంగ చర్చకు రావాలని మట్ట వెంకట్ సవాల్ విసిరారు. అప్పటి సీఐ ఆంజనేయులు సైతం ఈ కేసులో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థలో పని చేస్తున్న వ్యక్తి, నిందితురాలు రూప సోదరుడు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావుతో చర్చలు జరిపారని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.


