‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
ప్రభుత్వాసుపత్రిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
గర్భిణీలకు సీమంతాలు చేసిన రాధాకృష్ణ
ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబ సభ్యులతోపాటు సమాజం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుని మహిళను ఉన్నతంగా తీర్చిదిద్ది తద్వారా ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలన్నారు. దేశవ్యాప్తంగా స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. మహిళ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. దేశంలో 50 శాతం మహిళల్లో రక్తహితన ఉందని నివేదికలు చెబుతున్నాయని ఈ పరిస్థితుల్లో మహిళలను ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయన్నారు. నరేంద్రమోదీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ముఖ్యంగా వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. మహిళల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని తెలిపారు. నరేంద్రమోదీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. గత టిడిపి ప్రభుత్వ యహాంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల్లో పొదుపు అలవాటు చేశారని గుర్తు చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఉచిత వైద్యశిబిరం ప్రారంభించి గర్భిణీలకు సీమంతాలు చేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్, కూటమి నాయకులు, కార్యకర్తలతోపాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


